రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ !

NAGARJUNA NAKKA

రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులపై సచిన్ పైలట్ వేసిన పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. సభ వెలుపల జరిగే కార్యక్రమాలతో స్పీకర్ కు సంబంధం లేదని పైలట్ వర్గం వాదించింది. 

రాజస్థాన్ పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. సచిన్ పైలట్ వేసిన పిటిషన్ పై విచారణను రాజస్థాన్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా సీఎల్పీ మీటింగ్ కు హాజరుకాలేదని, ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో అనర్హత వేటు ఎందుకు వేయకూడదో చెప్పాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ రెబల్స్ కు నోటీసులిచ్చారు. ఈ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సచిన్ పైలట్ హైకోర్టుకు వెళ్లారు. 

అసెంబ్లీ వెలుపల జరిగే సభలు, సమావేశాలకు విప్ వర్తించదని, ఈ విషయంలో స్పీకర్ కు అధికారం ఉండదని రెబల్స్ వాదించారు. తాము తమ పదవులకు రాజీనామా చేయలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, అలాంటప్పుడు అనర్హత వేటు ఎలా వేస్తారని రెబల్స్ ప్రశ్నించారు. స్పీకర్ సీఎం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. 

సీఎం గెహ్లాట్ నియంతృత్వ వైఖరికి నిరసనగా గళమెత్తే భావ ప్రకటన స్వేచ్ఛ రెబల్స్ కు ఉందని సచిన్ పైలట్ వాదించారు. దీన్ని ధిక్కారంగా పరిగణించకూడదన్నారాయన. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల్ని పదవుల నుంచి తొలగించే అధికారం.. ఆయా పార్టీల అధిష్ఠానాలకు ఉండదని కూడా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్.. విచారణ వాయిదా వేసింది. 

మొత్తానికి రాజస్థాన్ రాజకీయాలు రంజుగా మారాయి. సచిన్ పైలట్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడటంతో తీర్పు ఏం వస్తుందో అనే ఉత్కంఠ అక్కడి రాజకీయాలలో నెలకొంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వర్గాలు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: