చైనా ఆర్థిక వ్యవస్థ పరుగులు.. ఎలా సాధ్యం.. !
కామన్ మ్యాన్ టు కరోడ్ పతి... అందరి కల చెదిరింది. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల మూలాలపై కరోనా కాటేసింది. ఇప్పటికీ చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు ఇంకా గాడిలో పడలేదు. కానీ వైరస్‌కు పుట్టిల్లు అయిన చైనా మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. వైరస్ ఎఫెక్ట్ తర్వాత గణనీయమైన వృద్ధిని నమోదు చేసి వారెవ్వా అనిపించుకుంటోంది.
కరోనా కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కుంచించుకుపోయిన చైనా ఆర్థికవ్యవస్థ.. మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతోంది. సెకండ్ క్వార్టర్లో చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది. ఈ త్రైమాసికంలో 3.2 శాతం జీడీపీ గ్రోత్ రేటును నమోదు చేసింది. ఈ ఏడాది తొలి భాగంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం మేర కుంగిపోయింది. కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడంతో చైనా ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూసివేయడంతో ఆర్థికవ్యవస్థలో ఇంత క్షీణత కనిపించింది. కానీ రెండు నెలల క్రితం వైరస్ ప్రభావం తగ్గడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దీంతో చైనాలో ఆర్థిక కార్యకలపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
చైనాతో పాటు మిగిలిన ప్రపంచదేశాల్లో చాలా వరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేశాయ్. తిరిగి ఆర్థిక చక్రాన్ని గాడిలో పెట్టాయి. కానీ చైనా మాత్రమే తక్కువ టైంలో పురోగతి సాధించింది. డ్రాగన్ కంట్రీకి ఇది ఎలా సాధ్యమైంది..? చైనా ఎలా తమ ఆర్థికవ్యవస్థని తిరిగి గాడిలో పెట్టింది..? కరోనా భయం ఇప్పటికీ ప్రపంచదేశాల్ని వెంటాడుతునే ఉంది. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతూనే ఉన్నాయ్. దీంతో ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలని మిగిలిన ప్రపంచదేశాలు తలలు పట్టుకుంటున్నాయ్. కానీ చైనాలో మాత్రం వైరస్ వ్యాప్తి అంతగా లేదు. వైరస్ ఉనికి తర్వాత దాదాపు పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చింది డ్రాగన్. ఇదే చైనాకు ప్లస్ పాయింట్ అయింది. మిగిలిన ప్రపంచ దేశాలు ఎక్కువగా కరోనా కట్టడి, బాధితుల చికిత్స కోసం నిధుల్ని వెచ్చిస్తున్నాయ్. చైనా మాత్రం ఇదే సమయంలో తమ నిధుల్ని పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించింది. ప్రొడక్షన్‌ను తిరిగి ప్రారంభించింది.
ప్రపంచ దేశాలు కరోనా సమయంలో చితికిపోయిన తమ ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టడానికి పెద్ద పెద్ద ప్యాకేజీలను ప్రకటించాయ్. ఆ ప్యాకేజీలు బ్యాంకులు, పారిశ్రామిక రంగాల్ని తిరిగి పుంజుకోవడానికి మాత్రమే దోహద పడ్డాయ్. ప్రజలకు ఈ ప్యాకేజీలు ఎంతవరకు ఉపయోగకరమో పట్టించుకోలేదు. ప్రొడక్షన్‌ను ఎంత పెంచినా.. కొనేవాడే లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కానీ, చైనా మాత్రం ప్రకటించిన ప్యాకేజీని ప్రజలకు చేరువయ్యేలా చేసింది. ప్రజల చేతుల్లోకి డబ్బులు అందేలా జాగ్రత్తలు తీసుకోంది. అదే విధంగా పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కష్టకాలంలో మేమున్నామంటూ భరోసా నిచ్చింది. ప్రభుత్వ పాలసీలను ఆయా రంగాలకు అనుకూలంగా సవరించింది.
మిగిలిన దేశాలు ఉత్పత్తిపైనే దృష్టి పెడితే.. డ్రాగన్ మాత్రం ఆ ఉత్పత్తుల వాడకంపై దృష్టి పెట్టింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయాల వల్లే కరోనా కాలంలోనూ వారి ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకుంది. ఇటు మూడు రోజులుగా ఇండియా స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే.. మన ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.