ఓహో మంత్రి పదవి రేసులో ఈ ముగ్గురూ చేరారా ?
జగన్ మనసులో ఏముందో ఏంటో తెలియదు కాని, ఈనెల 22వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు వార్తలు రాగానే మంత్రి పదవుల కోసం ఎవరికి వారు రేసులో తాము ఉన్నాము అంటే, తాము రేసులో ఉన్నాము అన్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు. సామాజికవర్గాల సమీకరణలు కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉండగా, మరి కొంతమంది సీనియారిటీ, విధేయత వంటి వాటిని హైలెట్ చేసి చూపిస్తూ, ఈసారి జగన్ తమను తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు అని, తమకు అవకాశం దక్కుతుందని, తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పదవి లిస్ట్ లో తమ పేరు ఉండేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నాయకులను ఇదే విషయమై ఆరా తీస్తూ, తమ పేరు మంత్రివర్గ విస్తరణలో ఉండేలా చూడాలంటూ కోరుతున్నారు. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లు మంత్రి పదవుల విషయంలో తెరపైకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యే పేర్లు మంత్రివర్గం రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి జగన్ కు సన్నిహితుడిగా ఉంటూ, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించి, పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తాము మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లా నుంచి సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి వంటి వారు ఉన్నా మీరు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈసారి జగన్ నుంచి పిలుపు తమకే వస్తుందని, వీరంతా ఆశలు పెట్టుకున్నారు. ఇక వీరే కాకుండా, కృష్ణాజిల్లాలో జోగి రమేష్, కొలుసు పార్థసారథి, గుంటూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడదల రజిని, అంబటి రాంబాబు, చిత్తూరు జిల్లా నుంచి ఆర్ కే రోజా, పశ్చిమ గోదావరి నుంచి ముదునూరు ప్రసాదరాజు, తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ ఇలా చెప్పుకుంటూ వెళితే అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మంత్రులు పదవులపై ఆశలు పెంచుకున్నారు. ఈ మేరకు జగన్ వద్దకు తమ కోరిక చేరేలా సంకేతాలు పంపిస్తున్నారు.