తెలంగాణ బిజెపి కి ఇదే సరైన అవకాశమా ?
టిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య ఇప్పుడు అగ్గి రాజుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో స్పీడ్ పెంచారు. ఆదివారం వరంగల్, నిజామాబాద్, బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బిజెపి చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని, కెసిఆర్ కుటుంబం పై ఉన్న అన్ని కేసులను బయటకు తీస్తామని, ఆషామాషీగా వదిలిపెట్టబోము అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
కెసిఆర్, ఆయన కుమార్తె కవిత, కేటీఆర్ పై ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు అని, తమ పార్టీ నాయకులపై దాడి చేయడాన్ని తేలిగ్గా తీసుకోమని, తప్పకుండా సమాధానం చెబుతామని హెచ్చరించారు. దీనికి టిఆర్ఎస్ నాయకులు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా తెలంగాణ బిజెపి దూకుడు గానే ఉంటుంది. టిఆర్ఎస్ హవాను తగ్గించి, వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టాలనే దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అలాగే కొత్తగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ కంటే దీటుగా టిఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ముందుంటున్నారు.
ప్రభుత్వంలో లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, బీజేపీకి మైలేజ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకుని పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తలెత్తిన వివాదాన్ని రాజకీయంగా, తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది.