అన్ లాక్ 2.0 : దేశ ప్రజలకు శుభవార్త.... వేగంగా వ్యాక్సిన్ సాధ్యమేనని చెబుతున్న అధికారులు....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మార్చి నెలలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. పలు వ్యాక్సిన్ లు మంచి ఫలితాలు ఇస్తున్నా అవి ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయో ఇప్పుడే చెప్పలేము. 
 
అయితే ఐసీఎంఆర్‌ కొన్ని రోజుల క్రితం ఆగష్టు 15వ తేదీ లోపు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అయితే కొందరు వైద్య నిపుణులు తక్కువ సమయంలోఒ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాదని చెబుతుంటే మరికొందరు మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రక్రియలో అసలు పరీక్షలకు పట్టే సమయం తక్కువని అనుమతుల కోసమే ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. 
 
విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడం ద్వారా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక అధికారి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. భారత్ బయోటెక్ కు చెందిన అధికారులు పరీక్షల వరకూ నిర్ణీత ప్రొటోకాల్‌ ప్రకారమే చేస్తున్నామని నివేదికల సమర్పణ, అనుమతుల వంటి విధానపరమైన అంశాలకు పట్టే సమయాన్ని మాత్రమే తగ్గించనున్నామని చెబుతున్నారు. 
 
పరీక్షలు చేసిన 28 రోజుల తర్వాత భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రభావం, ఇతర విషయాలకు సంబంధించిన నివేదికలను సీటీఆర్‌ఐకి సమర్పించాల్సి ఉంటుంది. రెండో దశ పరీక్షల నిర్వహణకు 12 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపున్న ఆరోగ్యవంతులను ఎంచుకుని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా రెండో దశలో ఇచ్చిన వ్యాక్సిన్‌ రోగనిరోధక వ్యవస్థను ఎంతమేరకు ఉత్తేజితం చేసిందనే విషయాన్ని పరిశీలించి వ్యాక్సిన్ పనితీరుపై అంచనాకు వస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: