ఆంధ్రాలో అలా.. తెలంగాణలో ఇలా.. ఇదేంటి ఈనాడూ..?
కరోనా విషయంలో ఈనాడు దినపత్రిక ప్రజలను తప్పుదోపట్టించేలా కథనాలు రాస్తోందని వైసీపీ మండిపడింది. తెలంగాణలో ఒక మాదిరిగా, ఏపీలో మరోమాదిరిగా కరోనాపై వార్తలు రాయడం సరైంది కాదని ఆ పార్టీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కరోనా విషయంలో తెలంగాణ కన్నా ఏపీలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నా.. ఈనాడు వివక్షతో కథనాలు రాస్తోందన్నారు.
ఆయన ఏమన్నారంటే..” రామోజీరావు కష్టపడి పైకి వచ్చి ఉండవచ్చు. కానీ ఈ రోజు వివక్షతో వార్తలు రాయడం సరికాదు. తెలంగాణలో ఒక మాదిరిగా, ఏపీలో మరోమాదిరిగా కరోనాపై వార్తలు రాయడం సరైంది కాదు. ఇది తప్పు కాదా? 9 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం ఒక్క ఏపీ మాత్రమే. రికవరీ రేటు బ్రహ్మండంగా ఉంది. డేత్ రేట్ తక్కువగా ఉంటే తప్పుడు రాతలు రాస్తారా?. ఎందుకు కళ్లు మూసుకొని వార్తలు రాస్తారు...? అంటూ ప్రశ్నించారు.
గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్లతో ఇంటింటి సర్వేలు చేస్తుండటం మీకు కనిపించడం లేదా? ఓటుకు నోటుకు కేసులో దొరికితే అది కెమెరా తప్పు అంటారా?. రాజ్యాంగపదవిలో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో కలిస్తే హోటల్‌పై నిందలు వేస్తారా? ఓ డాక్టర్ తప్పతాగి రోడ్డుపై చిందేస్తే..మందు అమ్మిన వారిదే తప్పు అంటారా. ఇలాంటి వింత పోకడలు మానుకోకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారు అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.
వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేసిందో చూడాలని.. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి ఆదాయం గండి పడినా... గతంలో చంద్రబాబు చేసిన అప్పులు తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ ఆరు నెలల్లో రూ.28,122.4 కోట్లు పేద ప్రజలకు చేర్చామని వివరించారు.