ఏపీలో కరోనా విలయతాండవం.... ఒకరి నుంచి 157 మందికి...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రాష్ట్రంలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 82 మందికి కరోనా నిర్ధారణ కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3200కు చేరింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో తక్కువ కేసులు నమోదైన తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 
 
నిన్నటివరకు తూర్పుగోదావరి జిల్లాలో 303 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో 117 కేసులు నమోదయ్యాయి. 21,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 117 మంది కరోనా భారీన పడటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో గ్రామంలో హోటల్ కు అనుమతులు ఇవ్వడంతో వైరస్ వ్యాప్తి చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఒక వ్యక్తి మరణం వల్ల గ్రామంలోని 117 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి వల్ల జిల్లాలోని మరో 40 మందికి కరోనా సోకిందని మొత్తం 157 మందికి కరోనా సోకడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి మరణం తరువాత జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నియంత్రణ కోసం అధికారులు జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 64 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్రీన్ జోన్లలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు కరోనా భారీన పడుతున్నట్టు తెలుస్తోంది. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: