సజ్జలకు చుక్కలు చూపించబోతున్న పవన్ కల్యాణ్?
తాజాగా కడప జిల్లాలో సజ్జల కుటుంబం భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత ఉందనే విషయంపై చంద్రబాబు సర్కారు విచారణకు సిద్దమవుతోంది. తక్షణం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. పీసీసీఎఫ్, వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌లను ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమణలో ఉన్న భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు కలసి ఉన్నాయి అనే సమాచారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
కడప జిల్లా సీకే దిన్నె రెవెన్యూ పరిధిలో సర్వే నెం. 1599, 1600/1, 2, 1601/1, 1ఎ, 2, ఇంకా ఇతర సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో 42 ఎకరాల మేర రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి? ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అక్కడ ఎటువంటి వన్య ప్రాణులకి హాని కలిగింది అనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
అటవీ భూముల సంరక్షణకు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ నీ అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. దీంతో సజ్జలను టార్గెట్ చేయడం మొదలైనట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.