సాగు చేసే రైతులకే రైతు భరోసా.. రేవంత్ కీలక నిర్ణయం?
పంట వేసే ప్రతీ రైతుకు రైతుభరోసా ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆదాయపన్ను, ఎకరాల పరిమితి ఉండకూడదని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ముందుగా రైతుభరోసా విధివిధానాలపై విస్తృత ప్రచారం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా మరోసారి నిర్ధారించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద రెండు విడతల్లో ఎకరానికి 12వేల రూపాయలు ఇచ్చింది.
అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామి ఇచ్చింది. పెట్టుబడి సాయాన్ని పంట వేయని వారికి ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. విధివిధానాల్లో, అర్హతల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఛైర్మన్ గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా కేబినెట సబ్ కమిటీని గతంలో ఏర్పాటు చేసింది.
ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించింది. రైతు సంఘాలు, నిపుణులతో చర్చించి సూచనలను స్వీకరించింది. ఇటీవల అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కూడా జరిగింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఆదాయపన్ను చెల్లించే వారికి ఇవ్వాలా వద్దా.. ఎన్ని ఎకరాల వరకు పరిమితి ఉండాలనే అంశంపై తర్జన భర్జనల తర్వాత ఇవాళ తుది నిర్ణయం తీసుకున్నారు.