రేవంత్రెడ్డి జోరుకు కేటీఆర్ కళ్లెం వేసినట్టేనా?
గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా ప్రతిధ్వనించారని.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చేసిన పోరాటాలను చరిత్రపై చెరగని సంతకాలుగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు... పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేతలు, కార్యకర్తల అలుపెరగని పోరాటాల వల్లే... అదానీ విరాళం, లగచర్ల లడాయిలో సర్కార్ వెనక్కు తగ్గిందని కేటీఆర్ తెలిపారు. అక్రమ కేసులు పెట్టినా... వేధించాలని చూసినా.. మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ తీరు అపూర్వమని బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ ప్రశంసించారు.
దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను... కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నించి అడ్డుకుందామని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు, మూలస్తంభాలు అన్న ఆయన... గులాబీ జెండాకు.. వెన్నముక అని వ్యాఖ్యానించారు. పార్టీ తరపున నిలబడి... కలబడే... నేటి అలుపెరగని పోరాట యోధులే... రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు అని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.