వైద్య వ్యవస్థపై జగన్ కీలక నిర్ణయం..!
భారతదేశంలో అత్యధికంగా కరోనా టెస్టులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని మరోసారి గట్టిగా చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనాను కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరిచినట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ పదిలక్షల జనాభాకు 2,500లకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సౌకర్ంయగా ఉండగా.. అన్ని ఆస్పత్రుల్లోనూ ట్రూనాట్ కిట్లు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను కొనియాడారు. కరోనాను కట్టడి చేయడంలో వీరి పాత్ర అమోఘమన్నారు. కరోనా వైరస్ మరణాల రేటు కేవలం 2శాతం లోపే ఉందనీ.. అది కూడ వివిధ శారీరక రోగాలు ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు చెప్పారు.
ఏపీకి లక్షకు మందికి పైగా వలస కూలీలు రానున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లు కూడా త్వరలోనే వస్తారని చెప్పారు. అలా వచ్చే వాళ్లను తొలుత క్వారంటైన్ కు పంపిస్తామన్నారు. క్వారంటైన్ సెంటర్ వద్ద శానిటేషన్ వర్కర్లు అందుబాటులో ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దాదాపు 11వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసం లక్షమందికి క్వారంటైన్ సదుపాయాలు కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నియోజక వర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్వారంటైన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.
అంతేకాదు లాక్ డౌన్ కారణంగా ప్రజలు వైద్య సదుపాయాలు అందుకునేందుకు టెలీ మెడిసన్ ను ఉపయోగించుకోవాలని సూచించిన జగన్.. అందుకు తగ్గ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచుతామన్నారు. మరోవైపు జగన్ గ్రామస్థాయిలో క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వైద్య వ్యవస్థపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు.