ఏపీ పదో తరగతి విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్నటివరకు 572 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణతో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో పదో తరగతి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
 
ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా పదో తరగతి విద్యార్థులు వీడియో పాఠాలు వినేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తాజాగా విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు ఆకాశవాణి ద్వారా విద్యార్థులకు ఆడియో పాఠాలు వినిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నిన్న అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. మంత్రి స్థానిక ఎన్నికల వల్ల ఒకసారి, కరోనా వైరస్ వల్ల మరోసారి పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. 
 
విద్యా అమృతం పథకం కింద పదో తరగతి విద్యార్థులకు సప్తగిరి ఛానల్ లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని ఇకపై ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ పది పాఠ్యాంశాలను డిజిటల్ కంటెంట్ లో కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
విద్యా శాఖ పాఠ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంతో దీక్షా యాప్ కు లింక్ చేసింది. విద్యార్థులకు ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా దీక్షా యాప్ సహాయంతో సులభంగా నేర్చుకోవచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నాడు - నేడు పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: