మాస్కుల లొల్లి: టీడీపీ వర్సెస్ వైసీపీ.. నర్సీపట్నం డాక్టర్‌ ఇప్పుడు అర్ధమయ్యారు...

M N Amaleswara rao

ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయాలు చేయడం ఆంధ్రప్రదేశ్ నాయకులకు బాగా అలవాటైన పనే. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం చేయకుండా ఉండలేవు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..ఏపీలో కూడా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి కట్టడికి జగన్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ...లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తోంది.

 

ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ కూడా ఓ వైపు కరోనా మహమ్మారిపై ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, మరోవైపు తెలివిగా జగన్ ప్రభుత్వం లక్ష్యంగా రాజకీయం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ రాజకీయంలోకి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ కూడా వచ్చి చేరారు. సుధాకర్ ఇటీవల మాస్కులు, తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

 

ఇక కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఇదే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలోనే సుధాకర్ ఆరోపణలని వైసీపీ ఖండిస్తూనే, ఆయన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ఆరోపించింది. అటు ప్రభుత్వం కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాగే ఆయనపై పలు కేసులు నమోదు చేసింది.

 

అయితే ఇదే విషయంపై సుధాకర్ కూడా స్పందించారు. నర్సీపట్నం ఆస్పత్రిలో వసతులు, మాస్కుల కొరతపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఇక నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఎంతో ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇక ఈయన అయ్యన్న పాత్రుడుని పొగిడిన దాని బట్టి చూసుకుంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఆసుపత్రుల్లో సమస్యలు ఉంటే అవి ప్రభుత్వంతో సానుకూలంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. అలా కాకుండా వన్‌సైడ్‌గా విమర్శలు చేస్తే, ఇలాగే ఇబ్బందులు వస్తుంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: