కరోనా ఎఫెక్ట్: జగన్ ప్రభుత్వం కొత్త ఆలోచన.. పక్కాగా అమలైతే లాభం ఇదే...
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏదైనా అత్యవసర సమయంలో గానీ, లేదా నిత్యావసర వస్తువులకే ప్రజలు బయటకు రావాలని మిగతా సమయాల్లో బయటకు రావడానికి వీల్లేదని, ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నిరోధించడానికి కఠినమైన విధానాలని అనుసరిస్తుంది. అనవసరంగా ఎవరైనా బయటకొస్తే, పోలీసులు వారి మీద లాఠీ ఝళిపిస్తున్నారు. అయితే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కోసం బయటకొచ్చిన సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు.
గుంపుగుంపులుగా మార్కెట్లలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. మార్కెట్లలో స్థలం తక్కువ ఉండటం వల్ల ప్రజలు దగ్గరగా ఉండాల్సి వస్తోంది. దీంతో కరోనా వ్యాప్తి త్వరగా వచ్చే అవకాశముంది. అందుకనే ప్రజలు దూరంగా ఉండటానికి, మార్కెట్లని స్టేడియాలల్లో పెట్టిస్తున్నారు. స్టేడియం పెద్దగా ఉండటం వల్ల, ప్రజలు ఎంత సంఖ్యలో వచ్చిన గుంపులుగా ఏర్పడే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే కూరగాయ దుకాణాల వద్ద క్యూ లైన్లలో కూడా జనం మూడు అడుగులు దూరం నిలబడేలా మార్కింగ్ కూడా చేస్తున్నారు.
ఇదే విధానం రాష్ట్రం మొత్తం కొనసాగేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను వికేంద్రీకరించాలని ఆదేశించారు. కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరల్ని కలెక్టర్లు, టీవీలు, పేపర్లలో ప్రకటించాలని, అధిక ధరలకు విక్రయిస్తే 1902 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని నెంబర్ కూడా ఇచ్చారు.
అయితే ఇప్పటికే విజయవాడ లాంటి ప్రాంతంలో స్టేడియాల్లో రైతు బజార్లని నిర్వహిస్తున్నారు. మొదట్లో కాస్త క్రమశిక్షణ పాటించని ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల్ని జాగ్రత్తగానే పాటిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పక్కాగా అమలైతే కరోనా వ్యాప్తి చెందకుంటా ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ కు ఓ అర్ధం ఉంటుంది. ప్రజలు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఉంటారు.