కరోనా ఆదర్శం: వాళ్లు చాలా గ్రేట్.. ఆ కుటుంబాలు.. ఊరికి దూరంగా పొల్లాల్లోనే కాపురం..?

Chakravarthi Kalyan
ఓవైపు కరోనా శర వేగంగా దూసుకుపోతుంటే.. జనం మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. లాక్ డౌన్ పెట్టి ఇంట్లోంచి బయటకు రావద్దురా మొర్రో అన్నా వినట్లేదు.. మరోవైపు క్వారంటైన్‌లో ఉన్నోళ్లు కూడా కుంటి సాకులు చెప్పో.. పారిపోయే పళ్లికిలిస్తూ బయట తిరుగుతున్నారు. జనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే కరోనాను ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. కానీ కొందరు మాత్రం ఇతరులకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.

పెద్దగా చదువు లేకపోయినా ఓ మారుమూల గ్రామంలోని 25 కుటుంబాలు కరోనా కారణంగా ఊరికి దూరంగా పొలాల్లో ఉంటున్న విషయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఎమాయికుంట, అందుతండా గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల ఉగాండా దేశానికి వెళ్లి ఆదివారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు, పోలీసులు 14 రోజులు ఇంట్లోంచి బయటికి రావద్దని సూచించారు.

అయితే.. ఎమాయికుంటకి చెందిన వ్యక్తికి ఇంట్లో ప్రత్యేక గదిలేదు. కుటుంబ సభ్యులంతా కలిసే ఉంటున్నారు. అతడు ఇంట్లోనే ఉంటున్నా కుటుంబ సభ్యులు బయటికొచ్చి గ్రామంలో తిరుగుతున్నారు. దీనికి కొందరు గ్రామస్తులు అడ్డు చెప్పారు. దీంతో వీరు ఓ ఆలోచన చేశారు. కొన్నాళ్లపాటు వారికి దూరంగా ఉండడం కోసం ఈ మూడు కుటుంబాలు ఊరికి దూరంగా పొలాల్లో నివాసం ఉంటున్నారు..

పొలాల్లోనే గుడారాలు వేసుకుని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఇతరులకు ఈ మహమ్మారి వ్యాపించకుండా ఇలా ఉంటున్నామని చెబుతున్నారు. ఈ మాత్రం స్పృహ మెట్రో నగరాల్లో ఉంటున్నవారికి కూడా ఉంటే ఎంత బావుంటుందో కదా. వాళ్లు మాత్రం ఎంత చెప్పినా వినకుండా జనంలో బలాదూర్ తిరుగుతూ అందరికీ కరోనా అంటిస్తున్నారు. కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు జనంలో చైతన్యం ఒక్కటే మార్గం అన్న సంగతి అందరూ గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: