చదివింది పదో తరగతే... అయినా 31 బ్యాంకులకు సవాల్... రూ.13 లక్షలు టోకరా

Arshu
చదివింది పదోతరగతి.. వయసు 25 ఏళ్లు.. పబ్బులు లేదా ఖరీదైన ప్రాంతాల్లోని రెస్టారెంట్లలోనే పనికి కుదురుతాడు. వారం లేదా పదిరోజుల్లోపే అక్కడ మానేస్తాడు. మరో 3 నెలలు ఎవరికీ కనిపించడు. లోలోపల చేసే పనిమాత్రం డెబిట్‌ కార్డులను క్లోనింగ్‌ చేసి డబ్బులు కొట్టేయడం. ఇలా రెండేళ్లలోనే 31 భారతీయ, విదేశీ బ్యాంకులకు సంబంధించిన 150 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను క్లోనింగ్‌ చేసి రూ.13 లక్షలకు పైగా దోచుకున్నాడు. ప్రధాన నిందితుడు సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.10.1 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ(క్రైమ్స్‌) రోహిణీ ప్రియదర్శిని వివరాలను మీడియాకు వెల్లడించారు. తర్ఫీదు పొంది.. ‘యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌లలో ఏటీఎంల నుంచి రూ. 76 వేలు విత్‌డ్రా అయినట్లు.. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజర్‌ ఈ నెల 5న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఒడిశా గ్రామానికి చెందిన ముగ్గురు యువ‌కుల‌ను అరెస్ట్ చేశారు. ప్రఫుల్‌కుమార్‌ నాయక్‌(25), హేమంత్‌ కుమార్‌నాయక్‌(28), సుజిత్‌ కుమార్‌ నాయక్‌(31)లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు ప్రఫుల్‌ నాయక్‌ 2017 నుంచే ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది’ అని డీసీపీ వెల్లడించారు.

 ‘డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలను తస్కరించి నకిలీ కార్డులను ఎలా తయారు చేయాలనే అంశంపై సైబర్‌ కేటుగాళ్ల దగ్గర తెలుసుకున్నారు. ఎక్కువగా ధనవంతులొచ్చే అవకాశముండటంతో పబ్బులు, ఖరీదైన రెస్టారెంట్లను ఎంచుకునేవారు. అక్కడ బిల్లు కట్టేటప్పుడు ఏటీఎం కార్డు, పిన్‌ వివరాలను సిబ్బందికి ఇస్తుంటారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ యంత్రాలు లభిస్తున్నందున వాటి సాయంతో క్లోనింగ్‌ కార్డులను తయారు చేసుకొని ఆ కార్డులతో తెల్లవారుజామున మాస్క్‌ పెట్టుకుని మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ కార్డులను అనుమతించే ఏటీఎంల్లో ముందుగా మినీ స్టేట్‌మెంట్‌ తీసుకుంటారు. ఎక్కువ డబ్బులుంటే డ్రా చెయ్య‌డం లేదంటే అనుమానం వ‌స్తుంద‌ని చెయ్య‌కుండా ఉండ‌డం అంతా తెలివిగా ప్లాన్ చేసేవారు.


మొదట్లో పబ్బులు, రెస్టారెంట్లలో పనిచేస్తూ వినియోగదారుల డెబిట్‌ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తిర‌స్క‌రించడం, క్లోనింగ్‌, ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం వంటి అన్ని పనులను ప్రధాన నిందితుడు ప్రఫుల్‌ కుమార్‌ నాయక్‌ చేసేవాడు. పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో స్వగ్రామానికి చెందిన హేమంత్‌ కుమార్‌ నాయక్‌, సుజిత్‌ కుమార్‌ నాయక్‌ను రంగంలోకి దించాడు. ముగ్గురూ పదేళ్ల నుంచి హైదరాబాద్‌, చెన్నైలో ఉంటున్నారు. పదోతరగతి వరకు చదువుకున్న రెండో నిందితుడు హేమంత్‌ కుమార్‌ నాయక్‌ కార్డుల సమాచారాన్ని ప్రఫుల్‌ కుమార్‌ నాయక్‌కిచ్చేవాడు. అతనేమో క్లోనింగ్‌ చేసి ఆ కార్డును ఇస్తే మూడో నిందితుడు సుజిత్‌ కుమార్‌ నాయక్‌ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేవాడు. ఆ తర్వాత ముగ్గురు వాటాలు పంచుకుని జల్సా చేసేవారు’ అని డీసీపీ వివరించారు. నిందితుల దగ్గరి నుంచి స్కిమ్మర్‌, క్లోనింగ్‌ యంత్రం, రెండు ల్యాప్‌ట్యాపులు, 44 క్లోనింగ్‌ కార్డులు, 50 వరకు అసలు డెబిట్‌ కార్డులు, 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: