హాలీవుడ్ హీరోకే కాదు అతని భార్యకూ కరోనా..!
హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్, అతని భార్య రీటా విల్సన్ కు కరోనా ఎటాక్ అయింది. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఇద్దరినీ ఐసోలేట్ చేసి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో హాలీవుడ్ భారీగా నష్టపోతోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ హాలీవుడ్ తారల్నీ వదల్లేదు. వెటరన్ హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్, అతని భార్య రీటా విల్సన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆస్ట్రేలియాలో ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది.
63ఏళ్ల హాలీవుడ్ స్టార్ కరోనా బారిన పడటంతో ఆస్ట్రేలియర్ హెల్త్ ఏజన్సీలు అప్రమత్తమయ్యాయి. ఐసొలేషన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. హ్యాంక్స్ రెండు సార్లు ఆస్కార్ గెలుచుకున్నారు. ఇప్పటికే ప్రపంప వ్యాప్తంగా లక్ష 26వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 4700మంది మరణించారు. కరోనా బారిన పడుతున్న దేశాల్లో చైనా తర్వాత యూరప్ దేశాలున్నాయి. అటు అమెరికాలో 1312మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 38మంది మరణించారు. 10మంది పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆస్ట్రేలియాలో 126 కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. ఒకరి పరిస్థితి క్రిటికల్ గా ఉంది.
హ్యారీ పోటర్ ఫేం డానియల్ రాడ్ క్లిఫ్ కు కరోనా సోకిందనే వార్తలొచ్చినా, నిజం కాదని తేలింది. కరోనా ప్రభావం హాలీవుడ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ ప్రభావిత దేశాల్లో జరగాల్సిన షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ చిత్రం -నో టైమ్ టు డై విడుదల కూడా కరోనా దెబ్బకు వాయిదా పడింది. ప్రమోషనల్ టూర్లు వాయిదా పడుతున్నాయి. ఓవరాల్ గా కరోనా కారణంగా హాలీవుడ్ దాదాపు 100మిలియన్ డాలర్లు నష్టపోతోందని అంచనా.