భారత కోకిల సరోజినీ నాయుడు ధైర్య సాహసాలు మీకు తెలుసా..?
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. భారత కోకిలాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ప్రముఖ స్వాతంత్య్రయోధురాలు. ఆమె ఒక్క కవయిత్రి కూడా. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఈమె స్వాతంత్య్ర భారత తొలి మహిళా గవర్నర్ గా పనిచేసిన ఆమె రాజకీయాల్లో మహిళలకు అత్యున్నతస్థానం సాధ్యమే అని నిరూపించారు.
ఆమె తెలివితేటలకు ఆశ్చర్య పడిన నిజాం నవాబు ఆమెను విదేశాలకు పంపించాడు. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత డిసెంబర్ 2, 1898లో డాక్టర్ గోవిందరాజులు నాయుడును ప్రేమ వివాహము చేసుకున్నారు. వారి విహహాన్ని సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు. సమాజంలో కులాంతర వివాహలను వ్యతిరేకిస్తున్నరోజుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత చర్య ఎందరో ఆగ్రహానికి గురి చేసినా సరోజిని వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలిచారు.
ప్రముఖ పోరాట యోధుడు గోపాల కృష్ణ గోఖలేతో 1912 సంవత్సరంలో జరిగిన పరిచయం ఆమెలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. హిందూ ముస్లింల సఖ్యత గురించి ప్రజలకు వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. లక్నో నగరంలో జరిగిన ముస్లిం లీగ్ మహాసభలో హిందూ ముస్లీం భాయిభాయి అంటూ అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది.
1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీజితో పాటుగా పాల్గొన్నారు. రాయల్ సొసైటీకి సభ్యురాలిగా ఎన్నికైయ్యారు. ఆమె కవితకు కెయిజర ఇ హింద్ స్వర్ణ పతకం లభించింది. భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి మహిళా అధ్యక్షురాలు గా ఆమె పేరు చిరస్మరణీయం.
సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి ఆమె రాసిన మొదటి కవితా సంపుటి గోల్డెన్ థ్రెషోల్డ్ గా పేరు పెట్టి, హైదరాబాద్ యూనివర్సిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళా విద్య కోసం, హిందూ ముస్లీంల మధ్య సోరదభావం కోసం పనిచేసిన సరోజినీనాయుడు స్పూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని, రాజకీయ రంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని ఆశిద్దాం.