గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్...?

Reddy P Rajasekhar

ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు మెరుగైన ఉద్యోగానికి ఎంపికైతే శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తే మాత్రమే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మాత్రం సచివాలయ ఉద్యోగులు మెరుగైన ఉద్యోగాన్ని వదులుకోక తప్పదు. 
 
ప్రభుత్వం 2019 సంవత్సరం ఆగష్టు నెలలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్ జాబితా ఆధారంగా 1,10,000 ఉద్యోగులను నియమించింది. గ్రామ, వార్డ్ సచివాలయాలలో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వీరికి శిక్షణ ఇచ్చింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు ఇతర పోటీ పరీక్షలు రాసి మెరుగైన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 
 
ఇతర ఉద్యోగాలకు ఎంపికయిన వారు రాజీనామా చేసి బయటకు వెళ్లాలంటే మూడు నెలల వేతనాన్ని, ప్రభుత్వం శిక్షణ కోసం చేసిన ఖర్చును తిరిగి చెల్లించాలని అధికారులు చెబుతూ ఉండటంతో ఉద్యోగాలకు ఎంపికైనవారు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన ఒక ఉద్యోగికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఆ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అధికారులు ఆ వ్యక్తికి 57,095 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన తరువాత మాత్రమే రాజీనామా ఆమోదం తెలుపుతామని చెప్పినట్టు సమాచారం. 

జిల్లా ఉన్నతాధికారులు ఎంపీడీవోలకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వ్యక్తుల నుండి ఇప్పటివరకు అందుకున్న జీతభత్యాలు, ఇతర ఆలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేసిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజీనామా చేస్తే జీత భత్యాలు, ఆలవెన్సులు తిరిగి ఇవ్వాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నా అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు రాలేదు. ఆదేశాలు లేకుండానే జీత భత్యాలు, ఆలవెన్సులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: