నీతులు చెప్పేందుకేనా పవన్ .. ? ఆచరించేందుకు కాదా ?

చెప్పేందుకు నీతులు.. ఆచరించేందుకు కాదు అన్నట్లుగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఎక్కడైనా సభలు, సమావేశాలు పెట్టినప్పుడు అతిథిగా హాజరవుతున్న పవన్ అక్కడ రాజకీయాల గురించి, సమాజం గురించి తానొక్కడినే బాధపడుతున్నట్లుగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నిన్న ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక పవన్ ప్రసంగాలను వినేందుకు విద్యార్థులు కూడా ఆసక్తికనబరిచారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, దేశం కోసం నా జీవితాన్ని, సమాజ సేవలో తన వంతు పాత్రను త్రికరణ శుద్ధి తో నిర్వహిస్తానని ఆవేశంగా మాట్లాడారు. యువత ఆవేశాన్ని అర్థం చేసుకున్నానని, అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను అంటూ పవన్ తన ప్రసంగంలో చెప్పారు.


 ఈ సందర్భంగా అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసిగిపోయానని పవన్ మాట్లాడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ చెప్పుకున్నారు.  తాత్కాలిక ప్రణాళికలతో విద్యార్థులు ఉండకూడదని, పదేళ్లు, ఇరవైఏళ్ళ ప్రణాళికతో విద్యార్థులు ఉండాలని అప్పుడే దేశానికి ఏదైనా చేయవచ్చు అంటూ ఈ సందర్భంగా ప్రసంగించారు. సమావేశంలో పవన్ బాగానే మాట్లాడారు కాకపోతే ఆయన కూడా అవే సూచనలు ఆచరిస్తే బాగుండేది అని రాజకీయ మేథావులు సూచిస్తున్నారు. 


 2014లో పార్టీ పెట్టిన పవన్ అధికారం కోసం ఎందుకు ఇంతగా అడ్డదారులు తొక్కుతూ కంగారు పడుతున్నారని,  తెలుగుదేశం పార్టీతో అనుమానస్పద రాజకీయాలను చేస్తూ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, అధికారం దక్కించుకోవాలని ఆశ ఉంది కాబట్టే కదా అని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. జనసేన పవన్ పార్టీ పెట్టిన సందర్భంగా మాట్లాడిన మాటలకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని, పవన్ కూడా అందరి నాయకుల్లాగా మారిపోయారని, గతంలో సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా జనసేన కొత్త తరహా రాజకీయాలు చేస్తుంది అని చెప్పి ఇప్పుడు అదే సంప్రదాయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: