పెడన రాజకీయాల్లో ట్విస్ట్...టీడీపీకి సపోర్ట్‌గా వైసీపీ నేత?
ఈ మధ్య అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. ఎక్కడకక్కడే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ నేతలు రచ్చ చేస్తున్న సంఘటనలు చాలానే చూశాం. అయితే ఈ రచ్చకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఏమి అతీతంగా లేదు. అసలు ఇక్కడ 2019 ఎన్నికల ముందు నుంచే విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే జోగి రమేశ్‌లకు పెద్దగా పడటం లేదు.
ఉప్పాల పెడన సీటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 2014లో జగన్...ఆయనకు కైకలూరు సీటు ఇచ్చారు. అక్కడ ఆయన ఓడిపోయి, మళ్ళీ పెడన వచ్చేశారు. 2019లో అయిన సీటు వస్తుంది అనుకుంటే, అది కుదరలేదు. జగన్, జోగి రమేశ్‌కి సీటు ఇచ్చారు. ఇక ఉప్పాలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉప్పాల వర్గం అయిష్టంగానే జోగికి సపోర్ట్ చేసింది. ఆ ఎన్నికల్లో జోగి గెలిచారు. అయితే జోగి గెలిచాక పెడనలో ఉప్పాల వర్గానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ కార్యక్రమైనా జోగి వర్గానిదే హడావిడి అయిపోతుంది.
దీనికి తోడు ఇటీవల పెడన పార్టీ అంతర్గత సమావేశాల్లో ఉప్పాల, జోగి వర్గాల మధ్య పెద్ద గొడవే జరిగిందట. దీంతో ఉప్పాల వర్గం మరింత ఆగ్రహంతో ఉందట. స్థానిక ఎన్నికల్లో జోగి వర్గాన్ని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. పైగా మండలి రద్దు కావడంతో ఉప్పాలకు ఎమ్మెల్సీ పదవి రావడం కష్టం. ఇక ఈ కారణాలు అన్నిటితో స్థానిక ఎన్నికల్లో ఉప్పాల వర్గం సైలెంట్‌గా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.
పైగా ఉప్పాలకు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో మంచి పరిచయాలే ఉన్నాయి. ఆ పరిచయాలతోనే కొన్ని స్థానాల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు జోగి కూడా నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండడనే విమర్శలు ఉన్నాయి. ఇక ఈ కారణాలన్నీ వైసీపీ కొంపముంచడానికి సరిపోతాయని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది.