ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... 40 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం.. ?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుతున్న నిరుపేద బడుగు బలహీనవర్గాల అక్కచెల్లెమ్మల పిల్లల కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ రాష్ట్రంలో చదివే విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలతో పాటు, విద్యార్థుల చదువుకు అవసరమయ్యే మరొకొన్ని వస్తువులను కిట్ల రూపంలో అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఈ కిట్లను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మదర్సాలలో చదువుకునే విద్యార్థులందరికీ అందించనుంది.
రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కిట్లను అందించనుంది. ప్రభుత్వం ఈ కిట్లను జూన్ నెలలో పాఠశాలలు తెరచిన తరువాత పంపిణీ చేయనుంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం , పాఠ్య పుస్తకాలు కూడా సరిగ్గా అందలేదు.
సీఎం జగన్ రెండు జతల దుస్తులను మూడు జతలకు పెంచటంతో పాటు నోట్ పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగు, బెల్టును కిట్ రూపంలో అందించేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కిట్ల కోసం ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, మదర్సా పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులకు ఈ కిట్లను అందజేస్తారు.
అధికారులు సగటున 1350 రూపాయల నుండి 1550 రూపాయలు ఒక్కో విద్యార్థికి అందించే కిట్ కోసం ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 40లక్షల మంది విద్యార్థులు అర్హులుగా అంచనా వేస్తున్నా ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలలో మాత్రమే ఈ కిట్ల పంపిణీ జరిగేది. కానీ సీఎం జగన్ మాత్రం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మదర్సాలో చదువుకుంటున్న పిల్లలందరికీ కిట్లు పంపిణీ చేయించేలా ఆదేశాలు జారీ చేశారు.