హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ విజయాలకు బ్రేక్ వేసిన రోశయ్య పరిస్థితి ఏంటో?
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం....టీడీపీకి కంచుకోట అనడం కంటే, ధూళిపాళ్ళ వంశానికి కంచుకోట అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో ఇక్కడ ధూళిపాళ్ళ కుటుంబానిదే విజయం. 1983, 85, 89 ఎన్నికల్లో ధూళిపాళ్ళ వీరయ్య చౌదరీ హ్యాట్రిక్ విజయం సాధిస్తే, ఆయన తనయుడు ధూళిపాళ్ళ నరేంద్ర 1994, 99, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, 2019 ఎన్నికలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా జగన్ గాలిలో నరేంద్ర విజయాలకు బ్రేక్ పడిపోయింది. వైసీపీ తరుపున వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య స్వల్ప మెజారిటీతో నరేంద్రని ఓడించారు. అయితే దశాబ్దాల పాటు టీడీపీ హ్యాండ్ లో నడిచిన పొన్నూరు తొలిసారి వైసీపీ హ్యాండ్ లోకి వచ్చేసింది. ఎంత భారీ అంచనాల మధ్య గెలిచిన రోశయ్య, ఆ అంచనాలకు తగ్గట్టుగానే నియోజకవర్గంలోనే పని చేస్తున్నారు.
ఎప్పుడు నియోజకవర్గంలోనే తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని అర్హులకు అందేలా చేస్తున్నారు. ఇక ఈ 8 నెలల్లో సిసి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. అయితే నియోజకవర్గంలో పనులు చేసే విషయంలోనే కాకుండా, ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో కూడా రోశయ్య ముందున్నారు. టీవీ డిబేట్లల్లో కూడా రోశయ్య తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. అయితే ఎడాపెడా మాట్లాడటం కాకుండా, నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు.
ఇక అన్నీ రకాలుగా మంచి పనితీరు కనబరుస్తున్న రోశయ్యకు, రాజధాని విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితే ఉందని చెప్పొచ్చు. పొన్నూరు..అమరావతి పరిధిలోనే ఉండటంతో, అక్కడి ప్రజలు మూడు రాజధానుల పట్ల అంత పాజిటివ్‌గా లేరు. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందో? లేక రోశయ్యకు మరింత ఇబ్బందికరంగా అవుతుందో చూడాలి.