బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్‌కు షాక్...!
తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్. మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో కాస్త సైలెంట్ గా ఉంటున్న భరత్ తన మామ బాలయ్య ద్వారా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టి లోకేష్ స్థాయికి ఎదగాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్రీ భరత్ కు బ్యాంకు నోటీసులు అందాయి. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు ఈ నోటీసులు అందాయి.
హైదరాబాద్ అబిడ్స్ లోని కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి, టెక్నో ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గతంలో రుణాలు తీసుకున్నారు. కానీ దానిని తిరిగి చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు ఈ విషయమై అనేకసార్లు సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో తాజాగా వారికి నోటీసులు అందించారు. ఈ నోటీసులకు సరైన సమాధానం చెప్పకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.124,39, 21 వేలు చెల్లించాలని, లేనిపక్షంలో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకు పేర్కొంది.
టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీభరత్ కుటుంబం విశాఖలోని గాజువాక భీమిలిలో భూములను తాకట్టు పెట్టి దాదాపు నూట ఇరవై నాలుగు కోట్లకు పైగా డబ్బును అప్పుగా తీసుకుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వడ్డీ కూడా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న సొమ్మును వడ్డీ తో కలిపి అసలు కూడా చెల్లించాలని నోటీసులో పేర్కొంది. గతంలోను ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం భరత్ తో పాటు ఆయన తండ్రి పట్టాభిరామారావు, ఆయన సోదరుడు లక్ష్మణరావు తదితరులకు ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం.దీనిపై శ్రీ భరత్ స్పందించాల్సి ఉంది.