నల్గొండ రామలింగేశ్వర స్వామి జాతరలో అపశృతి... కాలు జారి నిప్పుల గుండంలో పడిపోయిన యువతి...?

Reddy P Rajasekhar

నల్గొండ జిల్లా నార్కేట్ పల్లి మండలంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంలో నడుస్తూ వెళ్లిన ఒక యువతి కాలు జారటంతో నిప్పుల గుండంలో పడిపోయింది. రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు అగ్ని గుండం నిప్పులను తొక్కారు. అలా ఒక యువతి కూడా అగ్ని గుండంలోని నిప్పులను తొక్కే క్రమంలో కాలుజారి కింద పడింది. 
 
ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై యువతిని బయటకు లాగారు. యువతికి స్వల్ప గాయాలు కాగా వెంటనే యువతికి చికిత్స అందించారు. పూర్తి వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అగ్ని గుండాలలో నడిస్తే తాము చేసిన పాపాలన్నీ పోతాయని భక్తులు విశ్వసిస్తూ నిప్పుల గుండంలో నడుస్తున్నారు. 
 
పోలీసులు భక్తులను ఒక్కొక్కరి చొప్పున పంపిస్తూ ఉన్న సమయంలో యువతి కాలు జారి కింద పడింది. యువతిని పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతికి ఈ ఘటనలో స్వలంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలోని అతి పురాతనమైన ఆలయాల్లో చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. 
 
12వ శతాబ్దానికి చెందిన గణపతి చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. తొలి ఏకాదశి రోజున, కార్తీక సోమవారాలలో, మహాశివరాత్రి పండుగ రోజున, పౌర్ణమి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అలా నిన్న జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రమాదం చోటు చేసుకుంది. యువతికి స్వల్ప గాయాలే కావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి యువతిని కాపాడినందుకు భక్తులు పోలీసుల కృషిని ప్రశంసిస్తున్నారు.                                             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: