టీడీపీ నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి రూటే సెపరేటు.. ఆయన ఏది మాట్లాడినా మీడియాలో హైలెట్ అవుతుంది. ఎంతటి సంచల వ్యాఖ్యలైనా జేసీ ఇట్టే అలవోకగా చేస్తారు. అందుకే ఆయన చుట్టూ వార్తల కోసం మీడియా ప్రతినిధులు మూగుతుంటారు. అయితే కేవలం మీడియా ముందే కాదు.. నాయకులు ముందు కూడా జేసీ దివాకర్ రెడ్డి స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారు.
చంద్రబాబు ముందు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు బాబూ.. అని చెప్పేంత పెద్దరికం, చనువు ఉన్న నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అయితే అలాంటి టీడీపీ మాజీ ఎంపీకి జగన్ సీఎం అయిన దగ్గర నుంచి వ్యాపారాల పరంగా చుక్కలు కనిపిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో ట్రావెల్స్ ఒకటి. అయితే వివిధ నిబంధనల కింద ఆయన బస్సులపై కేసులు పెడుతూ సీజ్ చేసేస్తున్నారని జేసీ ఇప్పటకే పలుసార్లు మీడియా ముందు వాపోయారు.
అయితే ఇప్పుడు తాజాగా జగన్ సర్కారు మరోషాక్ ఇచ్చింది జేసీకి. దివాకరరెడ్డి కి సంబంధించిన మైనింగ్ లీజులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసేసింది. అనంతపురం జిల్లా యాడికి వద్ద త్రిశూల్ సిమెంట్ పేరుతో కంపెనీని స్థాపించుతామని చెప్పి ఆయన సున్నపురాయి గనుల లీజు పొందారు. అయితే.. ఆయన సిమెంటు ప్యాక్టరీ పెట్టలేదు కాని, లీజు భూములలో అక్రమంగా గనులు తవ్వించారన్నది అభియోగంగా ఉంది. ఈ కారణంగా కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు జగన్ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. లీజు ప్రాంతం నుంచి 38 , 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పాపం.. జేసీ..
మరింత సమాచారం తెలుసుకోండి: