ఎక్సైజ్ సీఐ.. ఉచిత ఉద్యోగ పాఠాలు.. !

NAGARJUNA NAKKA

సమాజానికి ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న వ్యక్తి. ఓ వైపు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే.. మరోవైపు సేవాదృక్పథంతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. వందలాది నిరుద్యోగులు కొలువు సాధించేలా ఉచిత శిక్షణ ఇస్తున్నాడు.  

 

ఈ వ్యక్తి పేరు కొట్టె ఏడుకొండలు. నాగర్‌కర్నూల్‌ ఎక్సైజ్‌ సీఐ. నల్గొండ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆయన.. ఎనిమిదో తరగతిలో చదువు మానేసి పొలం పనికి వెళ్లేవాడు. లీనస్ అనే ఓ ఉపాధ్యాయుడు తిరిగి పాఠశాలలో చేర్పించడంతో.. పది పాసైయ్యాడు. ఇంటర్‌ చదువుతుండగానే జైల్ వార్డెన్ కొలువు సంపాదించాడు. ఉద్యోగం చేస్తునే ఓపన్ డిగ్రీ చేసి 2007లో గ్రూపు 2లో ఎక్సైజ్‌ ఎస్‌ఐ గా ఎంపికయ్యాడు.

 

నల్గొండలో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. గెస్ట్ లెక్చరర్‌గా పిలిచింది ఓ కోచింగ్ సెంటర్‌. అనివార్య కారణాలతో కోచింగ్ చెప్పడం నిలిపేసింది ఆ స్టడీ సెంటర్. అయితే, ఆ నిరుద్యోగులకు మాత్రం ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు ఏడుకొండలు. మొత్తం 38 మందికి ట్యూషన్ చెబితే ప్రస్తుతం 31 మంది ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు.

 

ఆ బ్యాచ్‌ తర్వాత ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆయన.. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేశారు. అయితే, సీఐగా ప్రమోషన్‌ రావడంతో 2017లో బదిలీపై నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బదీలీ అయ్యారు ఏడుకొండలు. అయినా, కోచింగ్ ఇవ్వడం మానని ఆయన.. నిరుద్యోగుల కోసం బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు.

 

అయితే ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వాలనుకున్న ఏడుకొండలు.. ఆన్‌లైన్ పాఠాలు బోధించాలని నిర్ణయించుకున్నారు. కోయంబత్తూర్‌ నుంచి పరికరాలు తెప్పించి సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో కోచింగ్‌ పాఠాలు బోదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం 24 కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఏకకాలంలో 13 వేల మందికి శిక్షణ ఇస్తున్నాడు ఎక్సైజ్ సీఐ.

మొత్తం మీద.. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఐ ఏడుకొండలుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఉద్యోగం చేయాలనుకునే ఆయన ఆశయం నెరవేరాలని ఆశిద్ధాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: