బడ్జెట్ 2020 : నిర్మలమ్మ ముందున్న సవాళ్లు !

NAGARJUNA NAKKA

ఓ వైపు ఆర్థిక మందగమనం, మరోవైపు ఆశించిన స్థాయిలో లేని ఆర్థిక పురోగతి... కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు అంశాలు పెద్ద సవాల్‌గా మారాయి. బడ్జెట్‌ ముందు వీటిని ఎలా ఎదుర్కోవాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అంతా బాగుందనే వాతావరణంలో చిన్న చిన్న ఒడిదుడుకులున్నా పెద్దగా పైకి కనిపించదు. కానీ అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచే ప్రతి సూచీ ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ఇలాంటప్పుడు చిన్న చిన్న నిర్ణయాలు కూడా చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. అంతేకాక.. బడ్జెట్‌పైనే పెట్టుబడులు, అంతర్జాతీయ రుణ లభ్యత ఆధారపడి ఉంటాయి. మరి ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఆర్థిక మంత్రి ముందున్న మార్గాలేంటి...?

 

దేశం పురోగతి సాధించాలంటే బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మామూలే. ఈ సారి కూడా బడ్జెట్‌ స్వరూపం ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎప్పటిలాగా ఈ సారి కూడా పొదుపు మంత్రం పఠిస్తే ఈసారి సక్సెస్‌ అయ్యే ఛాన్స్‌లు చాలా తక్కువే. ద్రవ్యలోటు విషయంలో కొంత ఉదారంగా ఉండి ఖర్చును మిగిలిన సంవత్సరంలో కొనసాగించాలి. ముఖ్యంగా మూలధన వ్యయం కిందకు వచ్చే భారీ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. ఇప్పటికే మధ్యలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు తగ్గిస్తే అది ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడం ఖాయం. కాబట్టి ఈ అంశంలో ఆచితూచి వ్యవహరించాలి..

 

 ఇక రెండో ముఖ్యమైన అంశాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీపైనే ఎక్కువగా ఫోకస్‌ చేసింది.  కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. కానీ, డిమాండ్‌ లేకుండా ఉత్పత్తి పెంచే ఉపయోగం ఉండదు.  దీంతోపాటు ఈ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు లాభాలను ఉపయోగించుకొనేలా పెట్టుబడులను పెంచలేకపోయింది. రుణలభ్యత ఉన్నా పెట్టుబడులు పెరగకపోవడం ఇక్కడ గమనించుకోవాలి. వ్యవస్థలో డిమాండ్‌ ఉంటే ఇవన్నీ పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం అత్యంత పరిమితంగా ఉన్న నిధులను ఎంపిక చేసిన రంగాలపై ఖర్చుపెట్టాలి. ఆ ఖర్చుతో ఫలితాలు బహుముఖంగా ఉండేట్లు చూసుకోవాలి.

 

ప్రధాని నరేంద్ర మోదీ 5 ట్రిలియన్‌ డాలర్ల కలను పూర్తి చేసేవి కేవలం ప్రైవేటు పెట్టుబుడులు మాత్రమే. గత నెల ఆర్థిక మంత్రి ప్రకటించిన 102 లక్షల కోట్ల విలువైన ఇన్ఫ్రా పంచవర్ష ప్రణాళికను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలి. నేషనల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ను శరవేగంగా ట్రాక్‌ పైకి తెచ్చినప్పుడే ఉపయోగం ఉంటుంది. దీనిలో 2021 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు రూ.19.5లక్షల కోట్లు. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా 39శాతం పెట్టుబడులు పెడితే.. ప్రైవేటు రంగం 22శాతం పెట్టుబడులను తెస్తాయి. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలను బలోపేతం చేస్తే ప్రైవేటు పెట్టుబడులకు అడ్డంకులు తొలగుతాయి.

 

ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం భారత్‌లో పేద, ధనిక వ్యత్యాసాలు మరింత పెరిగాయి. ఇది నిరుద్యోగతను పెంచడంతోపాటు.. డిమాండ్‌పై కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో పన్ను విధానంలో మార్పులు చేయడంతోపాటు.. చిన్న సంస్థలకు, స్టార్టప్‌లకు రాయితీలతో రుణాలను అందించాలి. సంపద పన్ను మరోసారి ప్రవేశపెట్టాలని అర్థశాస్త్రంలో నొబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఇటీవల ప్రకటించారు.

 

రాష్ట్రాలు మరిన్ని అప్పులు తెచ్చుకొనేలా అవకాశమివ్వాలి.. కేంద్రం  ఒక్కటే ఖర్చును పెంచితే సరిపోదు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చును పెంచాల్సి ఉంది. అందుకే రాష్ట్రాలు మరిన్ని రుణాలు తీసుకొని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. చాలా రాష్ట్రాలు మూలధన వ్యయాలు తగ్గించుకొనే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు రుణాలు తీసుకొనే పరిమితులను 2021 ఆర్థిక సంవత్సరంలో పెంచుకోవాలి. ఈ క్రమంలో రుణాలకు డిమాండ్‌ పెరిగి వడ్డీ రేట్లు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రంగాలపై దృష్టిసారిస్తే మంచిది. లేకుంటే ఒడిదుడుకులు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: