వైసీపీకి 12 మంది టీడీపీ ఎమ్మెల్సీల మద్దతు... చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్...?
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఎలాగైనా ఆమోదం పొందే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. వికేంద్రీకరణ బిల్లు అమలు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించిన జగన్ 12 టీడీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించడం ద్వారా బిల్లు ఆమోదం పొందేలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లినట్టు మొదట్లో వార్తలు వచ్చినా శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ ఇప్పటికే బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని స్పష్టతనిచ్చారు.
12 మంది టీడీపీ ఎమ్మెల్సీల మద్దతు అవసరం అని జగన్ భావించగా ఇప్పటికే ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు అంగీకారం తెలిపారని మిగతా ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా మద్దతు తెలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. జగన్ ప్రణాళిక ప్రకారం టీడీపీ ఎమ్మెల్సీల మద్దతుతో సాంకేతిక కారణాల వలన ఆగిపోయిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్సీల మద్దతుతో మండలి ఛైర్మన్ షరీఫ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ తరువాత బిల్లు ఆమోదం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయనుందని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈరోజు శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు.
తెలుగుదేశం పార్టీ ఈ సమావేశం ద్వారా వైసీపీ పార్టీకి టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరూ మద్దతు తెలపడం లేదని అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని తెలియజేయాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ సమావేశానికి ఎంతమంది హాజరవుతారో దానిని బట్టే ఎంతమంది వైసీపీకి మద్దతు ఇస్తారో తెలిసే అవకాశం ఉంది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరైనప్పటికీ మండలిలో మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీల మద్దతుతో జగన్ షాక్ ఇవ్వడం మాతం ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.