నిరుద్యోగ భృతి వచ్చేది అప్పుడేనట.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్..?
2018 సంవత్సరంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలను పొందు పరిచిన విషయం తెలిసిందే. అయితే 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటి నిరుద్యోగ భృతి. తెలంగాణలో ఉన్న గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నిరుద్యోగభృతి చెల్లిస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. కాగా ఈ హామీపై నిరుద్యోగులు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి విజయ కేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. కాగా టిఆర్ఎస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు..
ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న తమకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి అమలు చేస్తే తమకు కొంతైనా చేయూత దొరుకుతుంది అని అభిప్రాయపడ్డారు. అయితే కెసిఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోతున్నప్పటికీ నిరుద్యోగ భృతి అంశం మాత్రం తెరమీదకి రాలేదు. దీంతో తెలంగాణ సర్కారు ఎప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేస్తుంద అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది టిఆర్ఎస్ పార్టీ. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో పొందు పరిచిన విధంగా... రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని... ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్రంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి కోసం నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎవరు ఎలా గుర్తించాలి అనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.