అసంతృప్తులను టీఆర్ఎస్...ఎలా బుజ్జగించిందంటే..!
పార్టీ చెప్పినా.. వినని రెబల్స్‌పై టీఆర్‌ఎస్ చర్యలు తీసుకోనుందా..?రెబల్స్ బుజ్జగింపులో గులాబీ పార్టీ ఎంత వరకు సక్సెస్ అయింది..? ఎన్నికల ముందు జరుగుతున్న ఏకగ్రీవాలు పార్టీ అధినాయకత్వంలో ఉత్సాహాన్ని నింపుతున్నాయా..? పార్టీ పట్ల విధేయత చూపిన వారికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చింది గులాబీ అధినాయకత్వం.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రెబల్స్ ను బుజ్జగించే పనిని పూర్తి చేసింది టీఆర్‌ఎస్ .మంగళవారం ఉదయం నుంచే వీలైనంత మంది రెబల్స్ ను బరిలోంచి తప్పుకోవాలని సూచించింది. ఉమ్మడి జిల్లాల వారిగా నియమించిన ఇంఛార్జ్ లు ఆ పని పూర్తి చేశారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఉన్న రెబల్స్ సమాచారం తీసుకొని.. వారిని విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. ఇంకా బరిలో ఉన్నవారి వ్యవహారం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఇంఛార్జ్ నేతలు. ఎంత మంది రెబల్స్ బరిలో ఉన్నారో ఇంకా పార్టీకి లెక్కలు అందాల్సి ఉంది. పలు మున్సిపాలిటీల్లో అవకాశం దక్కకపోవడంతో రెబల్స్ హల్ చల్ చేశారు .
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 35 మున్సిపాలిటీల్లో 84 వార్డులు, ఒక కార్పొరేషన్లో ఒక డివిజన్ ను ఏకగ్రీవంగా దక్కించుకున్నట్లు గులాబీ పార్టీ ప్రకటించింది. పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలు తమ ఖాతాలో చేరాయని టీఆర్‌ఎస్ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు క్యాడర్ లేదని .... బీజేపీకి ఓట్లు లేవని విమర్శించింది టీఆర్‌ఎస్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ శత్రువులు అయిన.. రాష్ట్రంలో మాత్రం మిత్రులేనని ఆరోపించింది. పార్టీ చెప్పినప్పటికి వినని రెబల్స్‌పై చర్యలు తీసుకోవాడానికి రెడీ అయింది టీఆర్‌ఎస్. అదే విధంగా మాట విన్న వారికి భవిష్యత్త్‌లో పదవులు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికి అసంతృప్త నేతలను బుజ్జగించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి సక్సెస్ అయింది. భవిష్యత్తుపై ఆశలు కల్పించి తన పని కానించుకుంది.