ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... రేపటి నుండి ఖాతాల్లోకి నగదు... !
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్నాలలో భాగంగా వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ రైతు భరోసా పథకంలో భాగంగా సంక్రాంతి పండగ చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాలలో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉంచింది. రేపటి నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా 2 వేల రూపాయల చొప్పున జమ చేయనుంది. కొంతమంది రైతులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే పీఎం కిసాన్ - రైతు భరోసా పథకానికి ఒక ఖాతా చొప్పున ఎంపిక చేసింది. గతంలో సాంకేతిక కారణాల వలన కొన్ని ఖాతాలలో నగదు జమ కాలేదు.
ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు తొలి రెండు విడతల్లో రైతుల ఖాతాలలో నగదు జమయింది. ప్రభుత్వం సంక్రాంతి కానుకగా తుది విడత 2వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనుంది. సాంకేతిక కారణాలతో గతంలో జమ కాని ఖాతాలలో సమస్యలను పరిష్కరించి అందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
సీఎం జగన్ ఎన్నికల ముందు నవరత్నాల అమలులో భాగంగా 12,500 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత 12,500 రూపాయలకు మరో 1,000 రూపాయలు పెంచి పీఎం కిసాన్ వైయస్సార్ రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. సీఎం జగన్ ప్రకటన మేరకు అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో
67,500 రూపాయలు భరోసా అందనుంది. అధికారులు సీఎం జగన్ రాసిన లేఖలను రైతులకు అందించనున్నారు.