విజయమ్మకు ఓటు వేయలేదు కాబట్టే వైజాగ్ పై కన్నుపడిందట

Vijaya
ఇంత చెత్త, సొల్లు లాజిక్కులు తెలుగుదేశంపార్టీ నేతలకు తప్ప ఇంకోరికి రావుగాక రావు. విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంపిక చేశారు ? అనే విషయమై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా పోటి చేసిన విజయమ్మకు అక్కడి జనాలు ఎవరూ ఓట్లు వేయలేదట. అందుకనే ఆమె ఓడిపోయిందట. తన తల్లికి వాళ్ళు ఓట్లేయలేదు కాబట్టే ఇపుడు జగన్ కన్ను విశాఖ మీద పడిందని యనమల చెప్పారు.

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టడమంటే టిడిపి నేతలు ముందుంటారు. విశాఖపట్నం ఎంపిగా విజయమ్మ పోటి చేసి ఓడిపోవటానికి ఇపుడు జగన్ అదే నగరాన్ని రాజధానిగా చేసుకోవాలని అనుకోవటానికి ఏమన్నా సంబంధముందా ?  తన తల్లిని ఓడగొట్టిన జనాలపై జగన్ కు కోపముంటే విశాఖపట్నాన్ని అభివృద్ధికి దూరం చేస్తారు కానీ రాజధాని పెడతారా ?

అసలు ఎవరైనా కోపమొస్తే ఏం చేస్తారు ? నాశనం చేస్తారు, లేకపోతే అభివృద్దిని అడ్డుకుంటారు. అంతేకానీ యనమల చెప్పినట్లుగా రాజధానిని చేస్తారా ?  నిజానికి మొన్నటి ఎన్నికల్లో కూడా  విశాఖపట్నంలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లను టిడిపినే గెలుచుకుంది. కాబట్టి  విశాఖ అభివృద్ధిని జగన్ పట్టించుకోకూడదు. పోనీ మొత్తం ఉత్తరాంధ్రలో ఏమైనా రెడ్ల ప్రాబల్యమున్న ప్రాంతమా ? అంటే అదీ కాదు.  జనాభా మొత్తం మీద బిసిలు, కాపులదే మెజారిటి.

అయినా విశాఖను జగన్ రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారంటే రాజధాని అవ్వటానికి అన్నీ హంగులున్న నగరం కాబట్టే. లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని నగరాన్ని నిర్మించుకునే బదులు ఇప్పటికే బాగా డెవలప్ అయిన విశాఖను రాజధానిగా చేసుకుంటే మిగిలిన ప్రాంతాల  అభివృద్ధిపై ఎక్కువ  నిధులు ఖర్చు పెట్టవచ్చనే.  ఇక రాజకీయంగా కూడా పార్టీ బలోపేతానికి జగన్ పావులు కదిపితే కదపచ్చు. ఎవరేమి చేసినా అంతిమంగా రాజకీయ లబ్దే కదా కోరుకునేది. పైగా ఫ్యాన్ కు మూడు రెక్కలుంటాయి కాబట్టి జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారనే ఎకసెక్కాలొకటి యనమలకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: