కనబడుట లేదు : ఈ టీఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడున్నారో..?
వాళ్లంతా కాకలు తీరిన యోధులు.. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా చక్రం తిప్పిన వారే. కానీ కాలం కలసిరాకపోతే ఎవరు మాత్రం ఏంచేస్తారు. అందుకే పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా.. వారంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులు.. రెండేళ్ల వరకూ వరకూ అధికార ప్రభతో వెలిగినవారు.. ఇప్పుడు ఒక్కసారిగా పార్టీలో అనామకులుగా మారిపోయారు.
పెద్దగా ఎక్కడా మీడియాలోనూ కనిపించడం లేదు. ఇలా గులాబీదళంలో సైలంట్ గా ఉన్నవారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గాల్లో మంత్రిగా చేసిన అనుభవం ఈయనది. కేసీఆర్ కు బాగా సన్నిహితుడుగా పేరున్నవ్యక్తి.. అందుకే టీడీపీలో ఉన్న ఈయన్ను కేసీఆర్ కోరి పార్టీలోకి తెచ్చుకుని ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు.
ఆయన కూడా ఖమ్మం జిల్లాలో పెద్దగా ఉనికి లేని పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. నాలుగేళ్లు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఓటమి చెందడం ఆయనకు బాగా దెబ్బగా మారంది. పాలేరు నియోజకవర్గం నుంచి ఆయనపైనే గెలిచిన ఉపేందర్ రెడ్డి పార్టీలో చేరడంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ ఏకంగా మంత్రిపదవి దక్కించుకోగా.. మరో నాయకుడు నామా నాగేశ్వరరావు ఏకంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటే.. తుమ్మల మాత్రం క్రమంగా కనుమరగవుతున్నారు.
ఇక మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావ్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కొల్లాపూర్ నుంచి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించిన జూపల్లి 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. సేమ్ ఇక్కడ కూడా సిటింగ్ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరారు. అలాగే.. మాజీ హోమంత్రి నాయని నరసింహారెడ్డి కూడా ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మంత్రి చందూలాల్, స్పీకర్ మధూసూదనాచారి వంటి నేతలు కూడా పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు.