జగన్ కు కొత్త టెన్షన్..
మూడు రాజధానుల ప్రకటన సీఎం జగన్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాజధాని మార్పు పై ప్రజలు-పార్టీల నేతలు ప్రాంతాల వారీగా విడిపోయి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతన్నా ముఖ్యమంత్రి మాత్రం రాజధాని మార్పుపై మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. రాజధాని విషయంలో జగన్ వైఖరి మార్చుకోవాలని చాలా మంది సలహాలు, సూచనలు చేసినట్లుగా పలు వార్తలు కూడా చర్చనీయాంశమయ్యాయి. దీంతో జగన్ ఎటు వెళ్తారోనని సర్వత్రా చర్చ నెలకొంది. జగన్ ఏవైపు మొగ్గు చూపుతారోనని తెలుగు ప్రజలు అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ నెల 27న జరగనున్న కేబినెట్ సమావేశంలో మూడు రాజధానుల నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే జగన్ రాజధానిపై ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఏపీ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రికి కొత్త సమస్య వచ్చి పడింది. హైకోర్టును కర్నూల్ లో ఏర్పాటు చేయాడాన్ని బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. హైకోర్టు తరలింపుకు వ్యతిరేకంగా 26,27తేదీల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు.
దీనికి తోడు హైకోర్టు కాకుండా రాజధానినే ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేతలు సీఎం జగన్ కు లేఖ రాశారు. సీఎంకు లేఖ రాసిన వారిలో అన్ని రాజకీయ పార్టీల నేతలున్నారు. పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో కర్నూల్ రాజధానిని సీమ ఐక్యత కోసం త్యాగం చేశామని.. అందుకు ప్రతీకగా ఇప్పుడు రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్ రాయలసీమ ప్రాంతానికే చెందిన వారు కాబట్టి ఈ డిమాండ్ పై ముఖ్యమంత్రికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చని చర్చ జరుగుతోంది. దీంతో సీఎం జగన్ రాయలసీమ నేతలను ఎలా సంతృప్తి పరుస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.