కొరియా ఆ పని చేస్తుందని ట్రంప్ ఊహించాడా?

Suma Kallamadi

కిమ్ జోంగ్-ఉన్ తాను ప్రేమలో పడ్డామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట గుర్తుందా? కానీ.. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య మాటలు లేనట్లు కనిపిస్తోంది. పైగా.. అమెరికా, ఉత్తర కొరియాలు ఒక దానినొకటి ఉరిమురిమి చూసుకుంటున్నట్లు.. ఎవరు ముందు తప్పటడుగు వేస్తారని ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. కానీ ఇద్దరిలో ఎవరూ వెనుకడుగు వేయటానికి సిద్ధంగా లేరు. ఇద్దరు నాయకుల మధ్య రెండో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు.. ముందు అనుకున్నట్లుగా ఈ వారం జరగలేదు. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ సహాయకుడు కిమ్ యాంగ్-చోల్ న్యూయార్క్ వచ్చి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోను కలవాల్సి ఉంది. కానీ ఇద్దరూ కలవలేదు.


కొరియా అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ను ఒప్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని..ఇప్పటికే అభిశంసనకు గురైన ట్రంప్‌కు ఇది మరో ఎదురుదెబ్బని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో ఎటువంటి ఒప్పందం కుదరకపోతే ట్రంప్‌కు క్రిస్మస్‌ కానుక ఇస్తానన్న కిమ్‌..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశం మీద విధించిన ఆంక్షలను గణనీయంగా సడలిస్తూ కొత్త అణస్త్ర నిరాయుధీకరణ ఒప్పందంతో ఈ ఏడాది చివరిలోగా చర్చలకు రావాలని.. లేదంటే తాము ”కొత్త మార్గం” ఎంచుకుంటామని ఉత్తర కొరియా గడువు విధించింది. 


ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. దీంతో చర్చల విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే, తాము దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలను మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించారు నార్త్‌ కొరియా ఉప విదేశాంగ మంత్రి రి థే సాంగ్. క్రిస్టమస్‌కు ఏ కానుక ఎంచుకోవాలో అమెరికా ఇష్టమన్నారు. ఇందులో భాగంగానే క్షిపణి ప్రయోగాన్ని క్రిస్మస్‌కు ముందు ప్రయోగిస్తామా..లేదంటే న్యూ ఇయర్‌ తర్వాతైనా పరీక్షించొచ్చని తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఉత్తర కొరియాను ఒప్పించడానికి ట్రంప్‌ ప్రయత్నించారు. ఇందులో భాగంగా గత ఏడాది సింగపూర్‌లో రెండు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అది విఫలమయింది. 


ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌లు వియత్నాంలో మళ్లీ చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలప్రదం కాలేదు. హనోయ్లో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనంతరం ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు లేవు.తాజాగా దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక అధికార పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి వాషింగ్టన్‌ తన డిమాండ్స్‌ను అంగీకరించకపోతే దౌత్యం నిలిపివేసి సుదూర క్షిపణిని ప్రయోగించడంపై కిమ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం మొత్తం సాయుధ దళాలను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనే చర్చించినట్లు సమాచారం.  వేగంగా మారుతున్న పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న కొరియాకు ఇది కీలకమైన సమయమని పేర్కొన్నారు కిమ్‌. దీంతో 2017లో అమెరికాను చేరుకోగల ఆరు అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియా..మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: