తమ్మినేనికి ఘోర అవమానం

Vijaya
సతీ సమేతంగా ఢిల్లీకి వెళ్లిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు అవమానం జరిగింది. డెహ్రడూన్ లో జరిగిన రెండు రోజుల  స్పీకర్ల సదస్సుకు తమ్మినేని హాజరయ్యారు. అక్కడి నుండి ఢిల్లీకి భార్య వాణితో పాటు చేరుకున్నారు. ఢిల్లీలో ఒక రోజు గడిపిన తర్వాత అమరావతికి బయలుదేరారు.  స్పీకర్ వస్తున్న విషయం ముందే తెలుసు కాబట్టి ఏపి భవన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

ఒకరోజు తర్వాత తమ్మినేని ఏపి భవన్ కు ఖాళీ చేసి అమరావతికి బయలుదేరారు. అయితే సరిగ్గా తన సూట్ ను ఖాళీ చేసే సమయానికి ఏపి భవన్ అధికారులు ఓ కవర్ పంపారు. తనకు అందిన కవర్ చూసిన స్పీకర్ ఆశ్చర్యపోయారు. అందులో బస, వసతికి అయిన ఖర్చుల తాలూకు బిల్లుంది. తనకు బిల్లు ఇవ్వటం చూసిన స్పీకర్ ముందు ఆశ్చర్యపోయారు  తర్వాత మండిపోయారు.

తనకు బిల్లు ఇవ్వటమేంటని బిల్లు తెచ్చిన ఉద్యోగిపై మండిపడ్డారు. తాను రాష్ట్ర గెస్ట్ కాబట్టి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తమ్మినేని భావన. అయితే స్పీకర్ అరైవల్ ను సంబంధిత అధికారులు కేటగిరి-1 స్ధాయిలోనే బస, వసతి ఏర్పాటు చేయాలని అమరావతి సచివాలయం నుండి ఆదేశాలు వచ్చినట్లు సదరు ఉద్యోగి బదులిచ్చారు.  తమకు వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఏర్పాట్లు చేశామని కాబట్టి బిల్లు చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు.

నిజానికి సిఎం, స్పీకర్, మంత్రులతో పాటు క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా ఏపి భవన్లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏపి భవన్ అంటే ఒక్క ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే బస చేయరు. ఒక్కోసారి ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా బస చేయటం మామూలే. అయితే ఎవరికి ఎటువంటి కేటగిరిలో బస, వసతి ఏర్పాటు చేయాలన్నది సచివాలయంలోని ప్రోటోకాల్ విభాగం అధికారులు చూసుకుంటారు.

కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ తమ్మినేనికి మాత్రం తీరని అవమానం జరిగినట్లే లెక్క. అందరి ముందు తనకు బిల్లు ఇవ్వటంతో చేసేది లేక ముందు బిల్లు చెల్లించేసి దంపతులు బయటపడ్డారు. తమను బిల్లు చెల్లించాలని ఏపి భవన్ అధికారులు అడగటం తమ్మినేని భార్య కూడా బాగా అవమానంగా భావించారట. కానీ చేసేదేముంది అందరి ముందు బిల్లు చేతిలో పెట్టినాక. అధికారుల నిర్లక్ష్యానికి ఏకంగా స్పీకరే అవమానాలు పడాల్సొచ్చింది. ఇపుడీ విషయంపై తమ్మినేని ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: