ఏపీ పరిస్థితి ఏమిటీ!
దక్షిణాఫ్రికాలో బహుళ రాజధానుల్లాగా... ఏపీలో రాజధానులు రావచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే జగన్ చెబుతున్నట్లుగా బహుళ రాజధానుల వల్ల ప్రయోజనం ఉండదని, గతంతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన జాకబ్ జుమా నేరుగా పార్లమెంట్‌లో ప్రకటించారు. ద్వంద రాజధానులతో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. లెజిస్లేటివ్ రాజధాని ఓ చోట, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని మరోచోట ఉండడం వల్ల ఖర్చులు తడిసి మోపెడయ్యాయని చెప్పారు. రెండు నగరాల నుంచి పరిపాలన జరగడం వల్ల రెండు కార్లు, రెండు ఇళ్లు, రెండు వ్యవస్థలు నిర్వహించాల్సి వచ్చిందని ఇది తలకు మించిన భారమైందని జుమా స్పష్టంగా చెప్పారు.
కేప్‌టౌన్, పిటోరియా నుంచి పరిపాలన ఆర్థికంగా భారమవుతోందని, అన్ని కార్యకలాపాలు ఒకే నగరం నుంచి నిర్వహించేందుకు ఇకనైనా కసరత్తు చేయాలని దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో విస్తృతమైన చర్చ జరిగింది. దక్షిణాఫ్రికాలో బహుళ రాజధానులు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తూ.. తీవ్ర నష్టానికి ఎలా కారణమవుతున్నాయో అంతర్జాతీయ మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న దక్షిణాఫ్రికా కుప్పకూలే పరిస్థితులు వచ్చాయని విశ్లేషించాయి. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా, అంతర్జాతీయ మీడియా బహుళ రాజధానుల వల్ల ఉపయోగం ఉండదని చెబుతుంటే.. జగన్ మాత్రం మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల పెద్దగా ఖర్చు కాదని చెబుతున్నారు.
శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజైన మంగళవారం.. రాజధాని అమరావతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగానే జగన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘వికేంద్రీకరణ అనేది మంచి ఆలోచన. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనం కూడా మారాలి. బహుశా... ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు. యంత్రాంగం అక్కడి నుంచి పని చేయడం మొదలు పెట్టవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈరకంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయేమో! అలా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర డబ్బులున్నాయా అని ఆలోచించాలి. విశాఖలో పరిపాలనా రాజధాని పెడితే ఖర్చు ఏదీ ఉండదు. అక్కడ అన్నీ ఉన్నాయి. కొత్తగా మెట్రో రైలు వేస్తే సరిపోతుంది. రోడ్ ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులు అటూ ఇటూ చేసేందుకు కాస్త ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇలాంటి ఆలోచనలు కూడా సీరియస్‌గా చేయాలి’’ అని జగన్ పేర్కొన్నారు.