నా భర్తను చంపారు... వాళ్లను జైలులో పందుల్లా మేపుతున్నారు : చెన్నకేశవులు భార్య
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం విదితమే. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య మాట్లాడుతూ పోలీసులు మా ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పారని నా ముఖం చూసైనా విడిచిపెడతారని అనుకున్నానని చెప్పారు. ఇలాంటి కేసులు గతంలో చాలా జరిగాయని దిశ కేసు నిందితులు వారి కంటే దారుణం చేశారా...? అని చెన్నకేశవులు భార్య రేణుక ప్రశ్నించారు.
తన భర్తను ఎక్కడ ఎన్ కౌంటర్ చేసి చంపారో తనను కూడా అక్కడే చంపాలని రేణుక కోరారు. నేను మాత్రం ఇక బతకనని రేణుక చెప్పారు. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నానని పెళ్లై సంవత్సరం కూడా కాలేదని రేణుక అన్నారు. ఒక్కదాని కోసం నలుగురి ప్రాణాలను తీశారని దిశను ఉద్దేశించి అన్నారు. 9 నెలల పిల్లను రేప్ చేసినోన్ని విడిచిపెట్టలేదా...? వాళ్లను పందుల్లా జైల్లో మేపుతున్నారని అన్నారు.
నిందితులలో ఒకరైన శివ తండ్రి రాజప్ప మాట్లాడుతూ దిశ విషయంలో వీళ్లు తప్పు చేశారని, తప్పు చేశారని ఒప్పుకుంటున్నానని, తప్పు చేస్తే ఉరి తీయాలని కూడా చెప్పానని కానీ ఇప్పటివరకు అత్యాచారాలు, హత్యలు చేసిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలి కదా..? అని ప్రశ్నించారు. శివ సోదరి పద్మ మాట్లాడుతూ మా తమ్ముడు చేసింది తప్పే అని మా తల్లిదండ్రులకు ముందే సమాచారం ఇస్తే ముందే చివరి చూపైనా చూసేవారని అన్నారు.
అరిఫ్ తల్లి మౌలాన్ బీ మాట్లాడుతూ కొడుకు కడసారి చూపుకు కూడా నోచుకోకుండా ఎన్ కౌంటర్ చేశారని అన్నారు. మాకు అరీఫ్ శవంతో పని లేదని అంత్యక్రియలు చేసే అర్థిక పరిస్థితి లేదని మౌలాన్ బీ చెప్పారు. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య మాట్లాడుతూ నా కొడుకు చేసింది తప్పే అని కోర్టు తీర్పుకు అనుగుణంగా శిక్ష విధించాల్సిందని ఇకపై తన కొడుకులాగా అత్యాచార నిందితులకు కూడా ఎన్ కౌంటర్ లాంటి శిక్షలే విధించాలని అన్నారు.