తెలంగాణలో తహశీల్దార్ సిబ్బందిపై మరో పెట్రోల్ దాడి...!
కొన్నిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి దాడి చేసి తహశీల్దార్ మృతికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తెలంగాణలో ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. కనకయ్య అనే రైతు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిపై పెట్రోల్ తో దాడికి పాల్పడ్డాడు.
రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను సిబ్బందిపై పోయటంతో పాటు, అటెండర్ దివ్యపై కూడా పోసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మాత్రం రైతు కనకయ్య భూమికి సంబంధిన ఒక వివాదం నడుస్తోందని అందువలనే అతనికి పట్టాలు ఇవ్వలేదని పట్టాలు ఇవ్వకపోవటంతో ఆగ్రహానికి గురైన కనకయ్య సిబ్బందిపై దాడి చేశాడని చెబుతున్నారు.
తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ దృష్టికి, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పెట్రోల్ చల్లిన రైతుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని పెట్రోల్ చల్లిన రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో తహశీల్దార్ లు కొందరు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో గూడూర్ తహశీల్దార్ హసీనా బీ సురేష్ అనే రైతును 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో తహశీల్దార్ హసీనా బీ పరారీలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో మరో తహశీల్దార్ 7వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.