‘అఖండ2’ తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది: నందమూరి బాలకృష్ణ
అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. అఖండ తాండవం విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలగలిపిన సినిమా ఆపాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా ఎంచుకున్నారు.
అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే. నా వృత్తి నా దైవం. ఆ వృత్తే అఖండ సినిమాలో నా పాత్ర. పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మాతండ్రి గారికి పాదాభివందనాలు. ఇది యావత్ ప్రపంచ ప్రేక్షకులకు సంబంధించిన సినిమా. ఈ సినిమా కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమానే కాదు.. ఒక బైబిలు ఒక ఖురాన్ కి కూడా సంబంధించిన సినిమా. మన వేదం నుంచే విజ్ఞానం పుట్టింది. మన దేశం యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడే యువతరానికి అర్థమవుతుంది.
అఖండ సినిమా కూడా ఒక పరీక్ష లాంటిదే. సరిగ్గా కోవిడ్ సమయంలో రిలీజ్ అయింది. థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారా లేదా అన్న ఒక మీమాంస ఉండేది. అలాంటి సమయంలో భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా నిర్మాతలు అందరికీ ధైర్యం వచ్చి సినిమాలను రిలీజ్ చేయడం చేశారు. ఆ తర్వాత చేసిన వీర సింహారెడ్డి నేలకొండ భగవత్ కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ తాండవం అన్నీ కూడా అద్భుతమైన విజయాలు. అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. అఖండలో దేవుడు మనిషిలో పూనాడు. ఇందులో మనిషే దేవుడైతే ఏమవుతుంది.. సంభవామి యుగే యుగే అన్నదే చూపించాం. సకుటుంబం సపరివార సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. పిల్లలకు కూడా ఈ సినిమాని చూపించి, మన మూలాల గురించి తెలియజేయాలని కోరుతున్నాను. సనాతన ధర్మ పరాక్రమ ఏమిటో చూపించిన సినిమా అఖండ తాండవం. సత్యం మాట్లాడాలి ధర్మం దారిలో నడవాలి అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలి అని చాటి చెప్పిన సినిమా అఖండ తాండవం. ఎంతోమంది కష్టపడితేనే ఒక సినిమా అవుతుంది. తమన్ నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు. అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు దాని యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత ఉందనేది ముఖ్యం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు అందించడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక అనీర్వచనీయమైన అనుభూతిని కలిగించింది. ఈ సినిమా కోసం కష్టపడినా అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దిల్ రాజు గారికి మ్యాంగో రామ్ గారికి శ్రీధర్ గారికి డాక్టర్ సురేందర్ గారికి.. ఈ సినిమా విడుదల కావడానికి వాళ్ళు పడ్డ శ్రమకు ధన్యవాదాలు. ఇదంతా దేవుడు పెట్టిన పరీక్షగానే భావిస్తాను. ప్రేక్షకులు ఇచ్చిన విజయం ముందు ఇదంతా ఆఫ్ట్రాల్. ఈ సినిమాలో అన్ని కూడా అద్భుతమైన సన్నివేశాలు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసర్ల శ్యామ్ గారు, మా డాన్స్ మాస్టర్లు, గాయకులు అందరికీ అభినందనలు. ఇంత అఖండమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు. ఈ విజయాన్ని మీకు మీరు ఇచ్చుకున్నందుకు.. మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు.