మహారాష్ట్రలో సద్దుమనుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు

Suma Kallamadi
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు  పడుతున్నాయి. కాంగ్రెస్, శివసేన,ఎన్సీపీ పార్టీలు ఒక్కతాటి పైకి వచ్చాయి. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపి అంగీకరించాయి. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే విధంగా కాంగ్రెస్ కు 14 మంత్రి పదవులు, ఎన్సీపికి 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన ఒప్పుకుంది. ఆదివారం ఈ మూడు పార్టీల నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు.

ఉమ్మడి ప్రణాళికతో ముందుకు పోవాలని కూడా నేతలు నిర్ణయించారు. 18వ తేదిన గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతున్నారు అని తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 54 సీట్లు గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా, కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటి చేశాయి. ఇందులో ఏ కూటమికి కూడా మెజార్టీ రాలేదు. 


 
దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మెజార్టీ స్థానాలు గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.  బీజేపీ శివసేన మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. దీంతో గవర్నర్ రెండో స్థానంలో నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం జరిగింది. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో చర్చలు జరిపింది. అవి ఫలించకపోవడంతో గవర్నర్  ఎన్సీపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

ఎన్సీపి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టలేకపోయింది. దీంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కేంద్ర కేబినేట్, రాష్ట్రపతి వెంటనే దీనిని ఆమోదిండంతో ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపి, శివసేన మూడు ఏకతాటి పైకి రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: