ముంచుకొస్తున్న మహా తుఫాన్.. గుండెల్లో ఒకటే దడ..!
అరేబియా సముద్రంలో మహా తుఫాను భయపెడుతోంది. పశ్చిమతీరం వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. అటు బంగాళాఖాతంలో కూడా నాలుగైదు రోజుల్లో వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మహా తుఫాన్ ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాన్ మరింత తీవ్రమైన తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో అరేబియా తీర ప్రాంత జిల్లాల్లో, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో ప్రచండ గాలులు వణికిస్తున్నాయి. తుఫాన్ లక్షద్వీప్ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర—వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మహా తుఫాన్ లక్షద్వీప్‌కి 90కి.మీ. దూరంలో.. ఈశాన్య దిశగా కేంద్రీకృతమైంది.
ఉత్తర లక్షద్వీప్ దీవుల మీదుగా ఉత్తర-వాయవ్య దిశగా తుఫాన్ ముందుకు వెళ్తోంది. దీని ప్రభావంతో గంటకు 100-110కి.మీ నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో సముద్ర అలలు ఒక మీటర్ ఎత్తుకు ఎగసి పడటంతో.. వచ్చే 12 గంటల్లో లక్షద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరించింది. నవంబర్ 4వ తేదీ వరకు ఆగ్నేయ అరేబియా సముద్ర పరిధిలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. తుఫాన్ ప్రభావం కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ బృందాలను రంగంలోకి దింపాయి. అటు బంగాళాఖాతంలో కూడా ఈ నెల 5, 6 తేదీల్లో వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. మహా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని తెలుస్తోంది.