కమలం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు గులాబీకి కషాయం మింగినట్లుగా తయారవుతున్నాయా. ఇప్పుడు బీజేపీ అధిష్టానం చూపు తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో గులాబి దళపతికి ముచ్చెమటలు పడుతున్నాయా... ఇంతకాలం తాను చేసిన రాజకీయాన్నే ఇప్పుడు బీజేపీ ఆధినాయకత్వం చేస్తుండటంతో గులాబి దళపతికి మింగుడు పడటం లేదా... నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అన్నట్లుగా గులాబి పార్టీ నేతలు కూడా గులాబీకి గుడ్‌బై చెప్పి కమలం నేతలతో కరచాలనం చేయాలనే ఆలోచన చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి గులాబీ, కమలం నేతలు.
ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాపై ప్రత్యేక దృష్టి పెట్టాడట. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి రాబోవు సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారం పొందేందుకు సర్వ ప్రయత్నాలు మొదలు పెట్టారట. అందులో భాగంగా ఇప్పటికే అమిత్‌షా అటువైపు అడుగులు వేస్తున్నారు. అందుకే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఇక్కడి నుంచే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. అదే విధంగా బీజేపీ నాయకత్వంను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లోని నేతలను వరుసబెట్టి పార్టీలోకి లాగారు.
కాంగ్రెస్, టీడీపీకి చెందిన కరుడుగట్టిన నేతలను కూడా తమలో కలుపుకున్నారంటే కమలం పార్టీ ఎంతగా శ్రమిస్తుందో అర్థమవుతుంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇప్పుడు బీజేపీ గులాబీ పార్టీని టార్గెట్ చేసి అందుకు తగిన విధంగా లాభియింగ్ ప్రారంభించిందనే టాక్ వినిపిస్తుంది. కేసీఆర్ బీజేపీ ఎత్తులను ముందే గ్రహించి కొందరు పార్టీ మారకుండా నష్ట నివారణ చర్యలు తీసుకున్నప్పటికి నివురు గప్పిన నిప్పులా కొందరు గుంభనంగా ఉంటున్నారట. ఇప్పుడు గులాబికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కమలం గూటికి చేరేందుకు సన్నద్దమవుతున్నారట.
అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే , మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్యలతో పాటుగా మరికొందరు కమలం గూటికి చేరేందుకు అంతా రెడి అయి పార్టీలో అసమ్మతి రాగాలు తీస్తున్నారనే టాక్ ఉంది. అయితే వీరు త్వరలో అమిత్‌షా సమక్షంలో చేరుతారా.. లేక కొంతకాలం ఆగి మరికొందరిని తోడు తీసుకుని వెళుతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.