కేఫ్ కాఫీ డే : సిద్దార్ధ మరణం తర్వాత విస్తుపోయే వాస్తవాలు

frame కేఫ్ కాఫీ డే : సిద్దార్ధ మరణం తర్వాత విస్తుపోయే వాస్తవాలు

Vijaya

కేఫ్ కాఫీ డే ఛైర్మన్ సిద్దార్ధ మరణం తర్వాత కొన్ని విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిద్దార్ధ ఆత్మహత్య ఓ మిస్టరీగా మారితే తాజాగా బయటపడుతున్న విషయాలతో కుటుంబసభ్యులతో పాటు సంస్ధతో సంబంధాలున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఛైర్మన్ కు తెలియకుండానే వెనకాల నమ్మకమైన ఉన్నతస్ధాయి వ్యక్తులే గోతులు తవ్విన విషయం ఇపుడు బయటపడింది.

 

 ఇంతకీ విషయం ఏమిటంటే కేఫ్ కాఫీ డే లోని ఉన్నతస్ధాయిలో పనిచేసే కొందరు వ్యక్తులతో కలిసి మరికొందరు ఉద్యోగులు బోగస్ పత్రాలు సమర్పించి తమిళనాడులోని ఓ ప్రైవేటు బ్యాంకు నుండి రూ 145 కోట్లను అప్పు తీసుకున్నారని బయటపడింది. అప్పులు తీసుకోవటం కోసం కేఫ్ కాఫీ డే లోగోతో ఉండే పత్రాలను సమర్పించటంతో సదరు బ్యాంకు కూడా అనుమానించకుండానే అప్పులు ఇచ్చేసిందట.

 

సిద్ధార్ధ మరణం తర్వాత సంస్ధ కార్యకాలాపాలతో పాటు వ్యక్తిగత ఆదాయ వ్యయాలపైన కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సంస్ధకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలతో అధికారులు సంపద్రింపులు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే సదరు ప్రైవేటు బ్యాంకు అధికారులు కూడా అధికారులను కలిశారు.

 

145 కోట్ల రూపాయల కోసం సంస్ధలోని ఉన్నతస్ధాయి వ్యక్తులు సమర్పించిన పత్రాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించారు. అప్పుడు ఆ పత్రాలను అధికారులు కేఫ్ కాఫీ డే సంస్ధ బోర్డులోని కీలక వ్యక్తుల ముందుంచినపుడు అసలు విషయం బయటపడిందట. చిక్ మగళూరులోని కాఫీ తోటలకు సంబంధించిన కొందరు రైతుల పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ప్రైవేటు బ్యాంకును మోసం చేసిన విషయం బయటపడింది.

 

బోర్డులోని కీలక వ్యక్తుల మద్దతుతోనే కొందరు నకిలీ పత్రాలను తయారు చేసి భారీ రుణం పొందినట్లు ఇపుడు ఆదాయపు పన్నుశాఖ అధికారులతో పాటు సంస్ధ బోర్డు అనుమానిస్తోంది. ఎలాగూ సిద్దార్ధ మరణంపై అనేక ఏజెన్సీలు విచారణ మొదలుపెట్టాయి కాబట్టి మరిన్ని మోసాలు వెలుగు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: