తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ సామాన్యుడి నడ్డిని విరిచిందనే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే కీలకమైన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న 49% ప్రత్యక్ష పెట్టుబడులను భవిష్యత్తులో 100% విస్తరించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు అంటే రాబోయే రోజుల్లో చాలా వరకు రంగాల్లో విదేశీ కంపెనీల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది.
ఇక, అనేక నిత్యావసర వస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరల ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడే డీజీల్, పెట్రోల్‌పై రూ. 1 సుంకం పెంచడంతో సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి కీలక అంశాలపై పెంపు ద్వారా రవాణా రంగంపై పెను భారం పడుతుందని, ఇది పరోక్షంగా వినియోగదారులను దెబ్బతీస్తుందని అంటున్నారు. పాలు, నీళ్లు, కూరగాయల నుంచి అన్ని వస్తువుల ధరలు ఆటోమేటిక్గానే పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవిలా ఉంటే సీసీ టీవీ, జీడిపప్పు, ఇంపోర్డెట్ పుస్తకాలు, పీవీసీ పైపులు, ఫోరింగ్ సామాగ్రి, టైల్స్, మెటల్ ఫిట్టింగ్, ఫర్నిచర్, సింథటిక్ రబ్బర్, మార్బుల్ ల్యాప్స్, ఆప్టికల్ పైబర్, ఐపీ కెమెరా, డిజిటల్ రికార్డర్లు, ఏసీలు, లౌడ్ స్పీకర్లు, సిగరెట్లు, ఫ్లగ్స్, సాకెట్లు, గుట్కాల ధరలు భారీగా పెతగనున్నాయి. ఒకపక్క గృహ రంగానికి ఊతం ఇస్తున్నామని చెబుతున్న కేంద్రం.. గృహ నిర్మాణానికి ఉపయోగించే అన్ని రకాల వస్తువలపైనా సంకాలను భారీగా పెంచడంతో నిర్మాణరంగం కుదేలవుతుందని అంటున్నారు ఆ రంగంలోని నిపుణులు.
అదే సమయంలో దేశ వాణిజ్య రంగాన్ని కుదుపునకు గురి చేసిన జీఎన్టీ విషయంపై కేంద్ర మంత్రి నిర్మల మౌనం వహించారు. దీనిలో ఇప్పటికే ఉన్న శ్లాబులను తగ్గించే ప్రతిపాదన ఉందని తాజాగా లీకులు ఇచ్చినా.. అది మాత్రం చేయలేదు. నిజానికి ఆర్థిక సర్వేలో ప్రకటించిన దానికి, బడ్జెట్‌లో కేటాయింపులు, వడ్డనలకు మధ్య కూడా ఎక్కడా పోలిక లేక పోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రతిపాదన బడ్జెట్ విషయానికి వచ్చే సరికి ఎక్కడా కనిపించలేదు. పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. మొత్తంగా చూసుకుంటే.. ఈ బడ్జెట్ ప్రపంచాన్ని మెప్పించేదిగా ఉందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నిజమనే అనిపిస్తోంది. మాటలు ఎక్కువ- చేతలు తక్కువ అనే మాటను నిర్మల నిజం చేశారని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు కూడా..