కెసిఆర్ ను ఆకాశానికెత్తేసిన జగన్..! ఏమన్నారంటే ?

Chakravarthi Kalyan

హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు గోదావరి నది జలాల తోపాటు  అనేక  అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా ఏపీ సీఎం  జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో, నీటి పారుదల రంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ఇద్దరం ఒకటేననే భావన కలిగి ఉండాలని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కానీ రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించానని వివరించారు. 

రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండురాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశం గొప్ప ప్రారంమేని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్య పూర్వకంగా, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. కత్తులు దూసేది లేదని, చేతులు కలపాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: