
కృష్ణ గెలిచాడు.. విజయనిర్మల ఓడిపోయింది..
కృష్ణ, విజయ నిర్మల సినిమా ఇండస్ట్రీ లోనే చూడ ముచ్చటైన జంట. బహుశా తెలుగు సినిమా స్క్రీన్ పై వీరు చేసిన అన్ని సినిమాలు జంటగా ఇంకెవరూ చేసి ఉండరు. కృష్ణ, విజయనిర్మలది అంత హిట్ కాంబినేషన్.
ఈ జంట సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది.. కృష్ణ 1989 లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కృష్ణ.. తెలుగుదేశం అభ్యర్థి బోళ్ల బుల్లిరామయ్య పై విజయం సాధించారు.
కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసిన దాదాపు పదేళ్ల తర్వాత విజయనిర్మల ఎన్నికల బరిలో దిగారు. కృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే విజయనిర్మల తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. 1999లో కైకలూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయనిర్మల విజయం సాధించలేకపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో కేవలం 1100 ఓట్ల తేడాతో విజయనిర్మల ఓటమి చవిచూశారు. అయితే ఆ తర్వాత ఈ జంట రాజకీయాల వైపు తొంగి చూడలేదు. కృష్ణ, విజయ నిర్మల తర్వాత కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయాలలో కొనసాగుతున్నారు.