ఏపీ సీఎం జగన్ చేసిన ఒకే ఒక్క ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. సీఎం అంటే ఇంత సంచలనమా? ఇలాంటి నిర్ణయాలను కూడా ఒకే ఒక్క నిముషంలో తీసుకుంటారా? అనేలా సీఎం జగన్ చేసిన ప్రకటన తో అధికారులకు దిమ్మతిరిగిమైండ్ బ్లాంక్ అయింది. తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదికలో జగన్ కలెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్థానంలో ఉన్న జగన్ మాట్లాడుతూ.. అనేక సంచలన విషయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేయాలని ఆయన కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజావేదికలో తాను కలెక్టర్ల సదస్సును ఏర్పాటు చేయడంపై వస్తున్న వ్యాఖ్యలను జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పరోక్షంగా మాట్లాడుతూ.. చంద్రబాబును ఏకేశారు. ఒక్క నిబంధన కూడా పాటించడం లేదని, నిబంధనలను మనమే పాటించ కపోతే.. ఎలా ? ప‌్రజలకు ఏం చెబుతాం? అని జగన్ ప్రశ్నించారు.
అదే సమయంలో తాను ఇంత పెద్ద అవినీతి, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నిర్మాణంలో కలెక్టర్ల సదస్సును ఊరికేనే పెట్టడం లేదని, రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన ఏరేంజ్‌లో అవినీతి మయం అయిందో చెప్పడానికే తాను ఈ సదస్సును ఇక్కడ పెట్టానని చెప్పారు. అంతేకాదు, ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణ నిబంధనలను, నదీ సంబంధింత నిబంధనలను, వరద ముంపు నిబంధనలను కూడా జగన్ ఈ సందర్బంగా చదవి వినిపించారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాకు చెందిన అధికారి గత చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రజావేదికను నిర్మించవద్దంటూ.. రాసిన లేఖను కూడా జగన్ ప్రదర్శించారు.
వాస్తవానికి కలెక్టర్ల సదస్సు అంటే.. ఏదో ఆయా జిల్లాల్లోని సమస్యలను పరిష్కరించి లేదా తెలుసుకుని, లేదా సూచనలు చేసి పంపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, జగన్ ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికారులు నివ్వెర పోయారు. రాబోయే రెండు రోజుల్లోనే ప్రజావేదికను కూల్చి వేస్తామని, ప్రక్షాళన ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. మొత్తానికి జగన్ నిర్ణయం అధికారుల మతి పోగొట్టింది.