చంద్రబాబు ఓటమి నిశ్చయం: వైఎస్ జగన్

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును ప్రతిపక్ష వైసిపి నాయకుడు, అధక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీవ్రంగా ఆక్షేపించారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరించారని విమర్శించారు. గురువారం పోలింగ్ పూర్తయిన తర్వాత రాత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బెదిరించడం, ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించడం, అనేకచోట్ల అరాచకాలు, డ్రామాలు ఆడటం వంటి వెన్నో చేశారని దుయ్యబట్టారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన చోట్ల, రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఈవో జీకే ద్వివేదీ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్న ద్వివేదీ, ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. ఎన్నికల పరిశీలకుల నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఏపీలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ-వైసీపీ మధ్య రాళ్లురువ్వుకున్న ఘటనలు, ఘర్షణలు తలెత్తాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య జరిగిన రాళ్ల దాడిలో టీడీపీ నేత సిద్దా భాస్కరరెడ్డి, మరో వైసీపీ నేత మృతి చెందారు. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గుంటూరు జిల్లాలో కూడా కోడెల మీద దాడి జరిగింది.


ఏపీలో 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే, కేవలం 0.1 శాతమే ఈవీఎంలు సమస్య వచ్చిందని వాటిని సరిచేశామని ఈసీ తెలిపింది. పార్టీల ముఖ్యనేతలు జగన్మోహనరెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటివారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడ కుండా ఓటు వేయడానికి వెళ్లడంపై నిరసన వ్యక్తమైంది. రాజన్న రాజ్యం రాబోతుందని, 140 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ నాయకురాలు షర్మిల ధీమా వ్యక్తం చేశారు.


అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించు కున్నారు. అలాగే టీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సతీమణి శైలిమ తో కలిసి హైదరాబాద్‌ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం అంటే ఏప్రిల్-11,2019న పోలింగ్ జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు 45920 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ నిర్వహించారు. 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు కూడా  పోలింగ్ జరిగింది. ఇటు తెలంగాణలో 17లోక్‌సభ స్థానాలకు 34603 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ జరిగింది. 443 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎమ్ఐఎమ్, బీజేపీలు ప్రధానపార్టీలు పోటీలో ఉన్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: